ఆర్టీసీ సమ్మెపై రేపు హైకోర్టుకు సమర్పించే నివేదికను ప్రభుత్వం సిద్ధం చేసింది. కాలం చెల్లిన 26,900 బస్సులు మార్చేందుకు రూ.750 కోట్లు అవసరం ఉందని నివేదికలో పేర్కొంది. వచ్చే మార్చి నాటికి మరో 476 బస్సులు కాలం చెల్లుతాయని తెలపనుంది.
ఆర్టీసీకి రూ.2209 కోట్ల బకాయి...
తెలంగాణ ఆర్టీసీ వివిధ వర్గాలకు రూ.2209 కోట్లు బకాయి ఉందని కోర్టుకు విన్నవించనుంది. సంస్థ ఉద్యోగులకే రూ.1521 కోట్లు బకాయి ఉందనే విషయాన్ని చెప్పనుంది. ఆగస్టు నాటికి ఆర్టీసీ రూ.5269 కోట్లు నష్టాల్లో ఉందని కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేయనుంది.
ఆర్థిక పరిస్థితి యూనియన్లకు తెలుసు...
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అంతా యూనియన్లకు తెలుసనే విషయాన్ని సర్కారు చెప్పాలనుకుంటుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని యూనియన్లు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాయనే విషయాన్ని పునరుద్ఘాచింటాలని భావిస్తోంది. పండగలు, ముఖ్య సమయాల్లో సమ్మెకు దిగడం యూనియన్లకు అలవాటుగా మారిందని ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది. అయోధ్య తీర్పుపై హై అలర్ట్ ఉన్న సమయంలో చలో ట్యాంక్‌బండ్ నిర్వహించడాన్ని సీరియస్‌గా ప్రస్తావించాలనే యోచనలో సర్కారు ఉంది.
ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే...
రూ.47 కోట్లు ఇవ్వాలన్న కోర్టు సూచనను సానుకూలంగా పరిశీలించామని ప్రభుత్వం నివేదికలో పొందుపరిచింది. కానీ రూ.47 కోట్లతో సమస్య పరిష్కారం కాదని, ఆర్టీసీని ఇంకా ఎన్నిసార్లు, ఎంతకాలం ఆదుకోవాలనే వాదనను కోర్టుకు వినిపించనుంది. ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, పారిశ్రామిక వివాద చట్టానికి అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు ప్రభుత్వం విన్నవించనుంది.