ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ బోర్డును ఈ నెల 15వ తేదీ లోపు ఏర్పాటు చేయాలని సంస్థ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 97 డిపోలు, 3 వర్క్‌షాప్‌ల నుంచి ఇద్దరు చొప్పున 200 మందితో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. బోర్డు ఏర్పాటైన వెంటనే అన్ని డిపోల మేనేజర్లు ఆయా డిపోల పరిధిలోని బోర్డు సభ్యులతో సమావేశమై సంస్థ ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలన్నారు. ఉద్యోగుల సమస్యలపైనా చర్చించాలని సూచించారు.
హైదరాబాద్‌లో మంగళవారం ఆర్టీసీ ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో ఎండీ సమీక్ష నిర్వహించారు. బస్సుల్లో సరకు రవాణా అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. వీలైనంత త్వరగా వంద బస్సులను సరకు రవాణాకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో ప్రైవేటు సరకు రవాణా సంస్థల వద్దకు వెళ్లి పరిశీలించారు.
ఎక్కువ ఏం రవాణా చేస్తున్నారు..
టోకు ధరల వర్తకం ఏ ప్రదేశాల్లో జరుగుతుంది...? వేటిని ఎక్కువగా రవాణా చేస్తున్నారు? ఎంత రుసుము వసూలు చేస్తున్నారు? వినియోగదారులకు ఎలా చేరవేస్తున్నారనే వివరాలు డిపో మేనేజర్లు ఉన్నతాధికారులకు అందించినట్లు విశ్వసనీయ సమాచారం. దాన్ని అనుసరించి సరకు రవాణా ఏయే మార్గాల్లో లాభదాయకంగా ఉంటుందో విధివిధానాలు రూపొందించాలని ఎండీ సూచించినట్లు తెలిసింది.
ప్రభుత్వశాఖలతో ప్రయోగం...
తొలుత ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సరకు రవాణా చేయనున్నట్లు సమాచారం. అనంతరం దానిపై సమీక్షించి ప్రైవేట్ రంగంలో సరకు రవాణాను అనుమతించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాటు ఏ రూట్లలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి, ఏ రూట్లలో బస్సులను తగ్గించవచ్చు అనే విషయాలపైనా సమావేశంలో చర్చించామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఒకే రూట్లో రెండు డిపోల బస్సులు ప్రయాణం చేస్తే వాటిని సమన్వయం చేసుకొని... తక్కువ ఆదాయం వస్తున్న వాటిని తగ్గించాలని నిర్ణయించారు. తగ్గించిన బస్సులను సరుకుల రవాణాకు వినియోగించనున్నారు.
హామీల అమలుపై..
కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుపై కాడా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు వేతనాలు, మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించనట్లు తెలిపారు. కుటుంబానికి ఒకటి చొప్పున 38 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. రాత్రి 8 గంటలలోపు ముగిసే డ్యూటీలు మాత్రమే కేటాయించేందుకు మహిళా కండక్టర్ల నుంచి వినతులు తీసుకున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా సౌచాలయాలు, డ్రెస్ చేంజ్‌రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లను క్రమబద్ధీకరిస్తూ రెండు రోజులక్రితం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: ఎంఎస్ఎంఈ బోర్డు సభ్యునిగా ఎంపీ బండ ప్రకాశ్