కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను పాఠశాలల క్యాంటీన్లలో, మెస్‌లలో, హాస్టళ్లలో విద్యార్థులకు అమ్మకుండా నిషేధించే నిబంధనలను ‘భారత ఆహార భద్రతా ప్రమాణాల మండలి’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రూపొందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఆహార పదార్థాలపై ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్త నియమావళిని మండలి సిద్ధం చేస్తోంది.
ఇందులో ముఖ్యాంశాలు..
- పాఠశాల ఆవరణకు 50 మీటర్ల దూరం వరకు ఈ పదార్థాల విక్రయాలనూ నిషేధించాలి.
- అనారోగ్యకరమైన ఆహార పదార్థాలే బాలల ఊబకాయానికి దారితీస్తోంది. ఈ సమస్య దేశంలో తీవ్రంగా పెరుగుతోంది.
- ఎక్కువ ఉప్పు, చక్కెర పిల్లల ఆరోగ్యంపైనే కాకుండా మేధస్సుపై ప్రభావం చూపి మందబుద్ధులుగా మారుస్తాయి.
ప్రకటనలకు ముకుతాడు
కొన్ని ఆహారోత్పత్తుల కంపెనీలు వాటి ఉత్పత్తులపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రకటనలు ఇస్తున్నాయని వాటికి ముకుతాడు వేయాలని మండలి నిర్ణయించింది. ఆరోగ్యకరమైన ఆహారానికి తమ ఉత్పత్తులే ప్రత్యామ్నాయమని వాటిని తినాలని కొన్ని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి.
పిల్లలు ఆరోగ్యకరంగా ఎదగాలని, బాగా చదువుకోవాలనే జాతీయ లక్ష్యాలకు విఘాతం కలిగించేలా పలు కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నట్లు వివరించింది.
జీవనశైలి వ్యాధులతో మరణాలే 71 శాతం
ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 71 శాతం జీవనశైలి వ్యాధులవేనని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించినట్లు మండలి తెలిపింది. ఏటా ఈ మరణాలే 4.10కోట్లు ఉంటున్నాయి. 30-69 ఏళ్లలోపు మరణాల్లో జీవనశైలి వ్యాధులతో మరణించినవారే కోటిన్నర మంది. తక్కువ, మధ్య తరగతి ఆదాయమున్న దేశాల్లో ఈ మరణాలు ఎక్కువ.
- జీవనశైలి వ్యాధులకు కారణమవుతున్న అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను నియంత్రిస్తారు.
- భారత ప్రజలు పోషకవిలువలున్న నాణ్యమైన ఆహార పదార్థాలు తినేలా, కొనేలా చూసేందుకు ప్రమాణాలను రూపొందిస్తున్నట్లు ఎఫ్‌ఎస్‌ఏఏఐ వెల్లడించింది.
- గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో మొత్తం 1,06,459 ఆహార పదార్థాల నమూనాలను మార్కెట్ల నుంచి సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించారు. వీటిలో 15.8శాతం నాసిరకం, 3.7శాతం అనారోగ్యకరం, మరో 9శాతం ప్యాకెట్ల లేబుళ్లపై తప్పుడు సమాచారం ఉంది. వీటిని అమ్ముతున్నవారికి జరిమానాలు వేసి రూ.32.58కోట్లు వసూలు చేశారు. నాసిరకం పదార్థాలను అమ్ముతున్న వారిపై 2018 మార్చినాటికి 5198 క్రిమినల్ కేసులు పెట్టారు.
తెలంగాణ పనితీరు బాగా లేదు
నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలను పట్టుకుని, నియంత్రించడంలో దేశంలో పది రాష్ట్రాలే బాగా పనిచేస్తున్నాయని మండలి వెల్లడించింది. వీటిలో తెలుగు రాష్ట్రాలు లేవు.
బాగా పనిచేయని మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం గమనార్హం. ఈ రాష్ట్రాల్లో పూర్తిస్థాయి ఆహార భద్రతా నియంత్రణ అధికారులను నియమించలేదు. ఆహార నమూనాలను పరీక్షించడానికి సరైన ప్రయోగశాలలు లేవు.
రంగులు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలను పాఠశాలల దగ్గర అమ్మకూడదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఇదీ చదవండిః చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్