శంషాబాద్ వద్ద హత్యాచారానికి గురైన 'దిశ' కేసులో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీనిని అనుసరించి మహబూబ్ నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ప్రకటిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు.
దిశ హత్యాచారం కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేసు సత్వర విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య ఘటనపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడంతో.. 56 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. అదే తరహాలో ఈ కేసులోనూ సత్వర తీర్పు రావాల్సిన అవసరముందని భావించిన ప్రభుత్వం.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు ప్రతిపాదనలు పంపింది. తాజాగా ఆ ప్రతిపాదనకు ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.