దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కాల్పులకు పోలీసులు వాడిన ఆయుధాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కాల్పులకు దారితీసిన పరిస్థుతులు, నిందితులు తమ ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపారన్న పోలీసులు వాదనపై విచారించనున్నారు. బందోబస్తుగా వెళ్లిన పది మంది పోలీసులలో కాల్పులు జరిపింది ఎవరు? వారి వద్ద ఉన్న తుపాకులు ఎలాంటివి అనే వివరాలను సిట్ ఆరా తీయనుంది. ఇప్పటికే వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సుప్రీంకోర్టు కూడా కమిషన్ ఏర్పాటు చేసి జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. త్వరలోనే కమిషన్ సభ్యులు హైదరాబాద్కు రానున్నారు. ప్రధానంగా వీరు ఎదురు కాల్పులపై విచారణ జరపనున్నారు. పోలీసులు వాడిన ఆయుధాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. నిందితుల మృతదేహాల్లో బుల్లెట్లు లేవు. బుల్లెట్ గాయాలను బట్టి... ఏ ఆయుధం నుంచి వచ్చిన తూటా ఎవరి శరీరంలోకి వెళ్లింది వంటి వివరాలతో ఫోరెన్సిక్ విభాగంలోని బాలిస్టిక్ నిపుణులు నివేదిక సిద్ధం చేయనున్నారు. జ్యుడీషియల్ కమిషన్ విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది.
ఇదీ చూడండి: 'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'