నష్టాలు నడుస్తున్న డిపోల ఆర్థిక పరిపుష్టి కోసం ఆర్టీసీ అధికార యంత్రాంగం కార్యాచరణ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నష్టాలు వస్తోన్న డిపోలను ఎండీ సహా ఈడీలు దత్తత తీసుకోనున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దత్తత తీసుకున్న డిపోల వివరాలు..
- ఆర్టీసీ ఎండీ-కూకట్‌పల్లి డిపో
- ఈడీ రెవెన్యూ - కల్వకుర్తి డిపో
- ఈడీ పరిపాలన-జహీరాబాద్ డిపో
- ఈడీ నిర్వహణ- పరిగి డిపో
- ఈడీ (ఇంజినీరింగ్)-తొర్రూరు డిపో
- ఈడీ(జీహెచ్ జెడ్)-కాచిగూడ డిపో
ఆక్యుపెన్సీ 80 శాతానికి పైగా పెంచడం.. సేవలు మెరుగుపర్చడం సహా ఆర్థిక స్థితిని సమీక్షించి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నష్టాలు వస్తోన్న డిపోలను ఆర్టీసీ ఉన్నతాధికారులు దత్తత తీసుకోనున్నారు. ఆర్డీసీ ఎండీ మొదలు ఈడీలు, సీనియర్ అధికారులు ఒక్కో డిపోను దత్తత తీసుకొని పనితీరును పూర్తిస్థాయిలో పరిశీలించి నష్టాలకు కారణాలను అంచనా వేయడంతో పాటు లాభాలను ఆర్జించేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సమీక్షించి పక్షం రోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేయాలి.
బస్సుల రద్దీని.. ప్రయాణికుల రాకపోకలను పరిశీలిస్తారు...
నష్టాలు వస్తోన్న మార్గాల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు బస్సుల రాకపోకల్లో మార్పుల విషయమై కూడా దృష్టి సారిస్తారు. ప్రయాణికుల రాకపోకలు, రద్దీని పరిగణలోకి తీసుకొని తగు నిర్ణయాలు తీసుకోవాలి. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో మెరుగుపరచడం, చెయ్యి ఎత్తిన చోటు బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అడిగిన చోట బస్సు దింపడం, కూడళ్లలో 2 నుంచి 3 నిమిషాలు బస్సు ఆపడం లాంటి విషయాలపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు.
ఉద్యోగుల సౌకర్యాలపై అభిప్రాయాలు...
డిపోల్లో మహిళా ఉద్యోగులకు, బస్ స్టేషన్లలో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపర్చేలా చర్యలు తీసుకోనున్నారు. డిపోల ఆర్థిక స్థితిగతులపై ఉద్యోగులతో చర్చించి ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలను పరిశీలించడం, ఇంధన పొదుపు లక్ష్యాలు, బస్సుల నిర్వహణ ఖర్చులు తగ్గించడంలాంటి చర్యల విషయమై ఉద్యోగుల అభిప్రాయాలు స్వీకరిస్తారు.
ఇదీ చూడండి: 'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'