తెలంగాణ రాష్ట్రంలో పుర ఎన్నికల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఇవాళ జరగనుంది. మరోవైపు కాంగ్రెస్ బీ-ఫారాల పంపిణీ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. పార్టీ విధేయులుగా ఉంటూ... ప్రజాదరణ కలిగిన నేతలు ఒక్కరే నామినేషన్ వేసి ఉంటే పరిశీలన తర్వాత అక్కడే బీ-ఫారాలు ఇచ్చేస్తున్నారు.
బలమైన అభ్యర్థుల ఎంపిక...
అలా కాకుండా కొన్ని చోట్ల ఒక్కో వార్డుకి, డివిజన్‌కి రెండుకు మించి పార్టీ తరఫున నామినేషన్లు పడ్డాయి. అలాంటి చోట.. నామినేషన్ల పరిశీలన తర్వాత బలమైన నేతలను ఎంచుకుని బీ-ఫారాలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత పడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి విషయంలో కాంగ్రెస్ ఆచి తూచి ముందుకు వెళ్తోంది.
ప్రజాక్షేత్రంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మున్సిపాలిటీలల్లో కనీస వసతులైన తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, పార్కులు, రహదారులు తదితర అంశాలను ప్రచార అస్త్రాలుగా మలచుకోనుంది. మరోవైపు ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, రుణమాఫీ, రైతుబంధు తదితర అంశాల్లో ఏ ఒకటి అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని తెరాస ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
తెరాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే...
పౌరసత్వ సవరణ చట్టం విషయంలో గులాబీ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేస్తే భాజపాకి వేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. తెరాస, భాజపా రెండు పార్టీలు ఒక్కటేనన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నారు.
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు చెందిన ప్రతి సమస్యను ఓటర్లను ఆకర్షించేందుకు అస్త్రంగా వాడుకొనే విధంగా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
ఇవీ చూడండి:బస్తీమే సవాల్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ గురి