ఎన్నికల ప్రచారంలో ఓటర్ల గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపల్ ప్రచారంలో ఓటర్లను బెదిరించే దోరణిలో మంత్రి మాట్లాడారని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ వెల్లడించారు.
ఓట్లు ఎవరికి వేశారో తెలుస్తుందని... తెరాసకు వేయకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. ఆ తరువాత బాధపడి ప్రయోజనం ఉండదని.. మరో నాలుగేళ్లు తామే అధికారంలో ఉంటామని ఎర్రబెల్లి దయాకర్ అన్నట్లు పేర్కొన్నారు. తెరాసకు ఓటు వేయాలన్న బెదిరింపు మాటలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని లేఖలో తెలిపారు.
ఓటరు ఎవరికి ఓటు వేశారో... మంత్రి ఎలా తెలుసుకుంటారో వివరణ కోరాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తక్షణమే మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'