రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఆరు పురపాలక సంఘాల్లో మాత్రమే కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. మరో ఎనిమిది మున్సిపాలిటీలపై ఆశలు మాత్రం పెట్టుకుంది. అధికార పార్టీకి దీటుగా పలు స్థానాల్లో గెలుపొందిన పురపాలక సంఘాల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకం అవుతారు.
పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు వచ్చిన పురపాలక సంఘాలను పరిశీలిస్తే... చండూరులో మొత్తం పది స్థానాలు ఉండగా తెరాసకు రెండు, కాంగ్రెస్‌కు ఏడు, భాజపాకి ఒకటి లెక్కన స్థానాలు దక్కాయి. వడ్డేపల్లిలో మొత్తం స్థానాలు పది కాగా రెండు తెరాసకు, ఎనిమిది కాంగ్రెస్‌కు వచ్చాయి. తుర్కయాంజల్‌లో మొత్తం 24 స్థానాలు కాగా అయిదు తెరాసకు, 17 కాంగ్రెస్‌కు, ఒకటి భాజపాకి, ఒకటి స్వతంత్రులకు వచ్చాయి. పెద్ద అంబర్‌పేటలో 24 స్థానాలు ఉండగా తెరాసకు 8, కాంగ్రెస్‌కు 13, భాజపాకి ఒకటి, ఇతరులకు రెండు లెక్కన వచ్చాయి. మణికొండలో మొత్తం 20 స్థానాలకు తెరాసకు 5, కాంగ్రెస్‌కు 8, భాజపాకి ఆరు, ఇతరులకు ఒకటి లెక్కన గెలుపొందారు. నారాయణఖేడ్‌లో మొత్తం 15కు గానూ తెరాసకు ఏడు, కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకుంది. హాలియాలో మొత్తం 12 స్థానాలు ఉండగా అయిదు తెరాసకు, ఆరు కాంగ్రెస్‌కు, ఒకటి ఇతరులకు వచ్చింది. ఈ ఏడు పురపాలక సంఘాల్లో ఫిజికల్‌గా కాంగ్రెస్‌కు ఛైర్మన్ పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. అక్కడ కూడా అవకాశం ఉన్న మేరకు ఎక్స్ అఫిసియో సభ్యులను రంగంలోకి దించి కాంగ్రెస్‌కు దక్కుకుండా చూడాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కాకుండా ఖానాపూర్, చేర్యాల, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, నల్గొండ, నేరేడు చర్ల, కొస్గి లాంటి ప్రాంతాల్లో అటు కాంగ్రెస్ ఇటు తెరాసకు పోటాపోటీగా స్థానాలు దక్కాయి. ఖానాపూర్, చేర్యాల, నల్గొండ, నేరేడు చర్ల, కొస్గి ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్‌కు, తెరాసకు సమానంగా స్థానాలు దక్కాయి. ఇక్కడ స్వతంత్రులు ఉంటే వారికి బేరసారాలు పెట్టారు. అదే విధంగా అధికార పార్టీకి ఎక్కువగా ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండడం వల్ల... వారికే ఎక్కువగా అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థులు చేజారకుండా విప్ జారీ చేసింది. రూ.20 స్టాంపు పేపర్‌పై అఫిడవిట్ తీసుకున్నందున విప్‌ను ధిక్కరించే అవకాశం తక్కువని భావిస్తున్నారు. అయినా... కూడా తెరాస కదలికలపై నిఘా ఉంచిన కాంగ్రెస్ ఎక్కడైన తమ పార్టీ సభ్యులను కొనుగోలు చేసేందుకు యత్నిస్తే...అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కష్టకాలంలో... జెండాలు ఇవ్వకుండా ఎన్నికల ఖర్చులకు రూపాయి ఇవ్వకుండానే 582 స్థానాలు గెలుస్తామని తాము కూడా ఊహించ లేదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో కేవలం 20 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి చెందారని పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో బలమైన పార్టీ క్యాడర్ ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: రాజ్‌భవన్‌లో ఎట్‌హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు