యువతి హత్యకేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలంగాణ డీజీపీ నుంచి తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వోద్యోగిపై బరితెగింపుతో వ్యవహరించి కిరాతకానికి పాల్పడటం హేయమన్నారు. ఈ ఘటనను ప్రజలంతా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో దోషులను ఉరి తీయాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు.
కఠినంగా వ్యవహరించాలి...
పోలీసులు వారిని అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. దేశంలో రెండోసారి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నేరాలపై కఠిన చట్టం తీసుకొచ్చామని చెప్పారు. ఇలాంటి కిరాతకులకు తొందరగా ఉరిశిక్షలు పడేలా చట్టంలో మార్పులు చేసినట్టు గుర్తుచేశారు. ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు.
ఈ కేసులో నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ సహాయం అందించొద్దని న్యాయవాదులను కేంద్రమంత్రి కోరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను పూర్తిగా అరికట్టేలా అంతా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండేలా మహిళల భద్రతకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు పంపిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు