పౌరసత్వ సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఈ బిల్లు ఏ కులం, మతం, ప్రాంతం, వర్గానికి వ్యతిరేకంకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆనాటి కాంగ్రెస్ స్వాతంత్రం తర్వాత మత ప్రాతిపదికన దేశ విభజన చేసిందని దుయ్యబట్టారు. పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, జైనులకు, రక్షణ కల్పించాల్సిందిగా పాక్ ప్రభుత్వం... భారత్లో మైనార్టీలుగా ఉన్న ముస్లింలకు రక్షణ కల్పించాల్సిందిగా భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. దురదృష్టవశాత్తు 70 ఏళ్లుగా పాక్ అక్కడి మైనార్టీలను పట్టించుకోలేదని చెప్పారు. వారిపై అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, మానభంగాలతో దేశం నుంచి వెళ్ళిపోయేలా చేశారని.. వారంతా ఇప్పుడు భారత్లో శరణార్థులుగా దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ నుంచి బతుకు జీవుడా అంటూ వచ్చిన మన వాళ్ళను ఆదుకోవడం కోసం, వారికి కనీసం బతికే అవకాశాలు కల్పించడం కోసం ప్రధాని మోదీ పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని అభివృద్ధిపథం వైపు తీసుకువెళ్తున్న మోదీ పట్ల కొన్ని విదేశీ శక్తులు మతపరమైన శక్తులు రాజకీయ శక్తులు కుట్రలు పన్ని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమాలు చేస్తున్న రాజకీయ పార్టీలు ఈ చట్టం భారతీయ ముస్లింలకు వ్యతిరేకమనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.
మతం పేరుతో ప్రజలను విభజించే రాజకీయ పార్టీల పట్ల ప్రజలు జాగ్రత్తతో ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలు ఈ చట్టాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్న ఈ తరుణంలో శాంతియుతంగా ఉండాలని ప్రజలను కిషన్ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల్లోగాని మరి ఎక్కడ కుహనా రాజకీయాలు మేధావుల కుట్రలో ప్రజలు పడవద్దని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ నియామకం