భగాయత్ భూముల వేలంలో తొలిరోజు భారీ స్పందన లభించింది. హెచ్ఎండీఏకు పంట పండింది. ప్లాట్లను దక్కించుకునేందుకు కొనుగోలుదారులు తీవ్రంగా పోటీపడ్డారు. 31311.5 గజాల విస్తీర్ణంలో ఉన్న 52ప్లాట్లు విక్రయించగా రూ.155 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా గజం రూ.77వేలు, అత్యల్పంగా రూ.30,200 పలికింది. సగటున గజం రూ.53,520 పలికినట్లుగా హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.
భూ సేకరణలో భాగంగా నాగోల్ మెట్రోస్టేషన్ సమీపంలోని ఉప్పల్ భగాయత్‌లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి సుమారు 750 ఎకరాల భూములను హెచ్‌ఎండీఏ గతంలో సేకరించింది. ఫేజ్-1, ఫేజ్-2 కింద అన్ని సౌకర్యాలతో లేఅవుట్లను అభివృద్ధి చేసింది. భూములు ఇచ్చిన రైతులకు ఫేజ్-1 లేఅవుట్‌లో ప్లాట్లను కేటాయించింది. అభివృద్ధి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సొంతంగానే నిధులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
స్థిరాస్తి వ్యాపారం జోరు మీద ఉండటం వల్ల ఫేజ్-2లోని 67కు ప్లాట్లకు గానూ 64 ప్లాట్లు గతంలో విక్రయించగా రూ.677 కోట్ల ఆదాయం సమకూరింది. శని, ఆది, సోమవారాల్లో ఫేజ్-1 లేఅవుట్‌లోని 124 ప్లాట్లు, ఫేజ్-2లోని 3 ప్లాట్లను విక్రయించేందుకు... ఈ-వేలం నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించింది. తొలిరోజు 58 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. కనీస ధర గజానికి రూ.30వేలుగా నిర్ణయించారు.
హోరా హోరీగా వేలం
తొలిదశలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 29 ప్లాట్ల విక్రయానికి నిర్వహించిన వేలం హోరాహోరీగా సాగింది. 150 నుంచి 300 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను దక్కించుకునేందుకు అనేకమంది పోటీ పడ్డారు. 166 గజాల ప్లాట్ రూ.1.27 కోట్లు పలికిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 6623.5 గజాలను విక్రయించగా రూ.40.04 కోట్ల ఆదాయం సమకూరింది.
రెండో దశలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన 300 నుంచి 2,482 గజాల విస్తార్ణంలో ఉన్న 29 ప్లాట్లు విక్రయానికి ఉంచారు. రెండింటికి బిడ్లు దాఖలు కాలేదు. మరో నాలుగింటికి ఒకటే బిడ్‌రావడం వల్ల రద్దుచేశారు. 23 ప్లాట్ల విక్రయించగా రూ.115 కోట్లు సమకూరింది. 822 గజాల ప్లాట్ రూ.6.29 కోట్లు పలకడం గమనార్హం.
ఇవీ చూడండి: 'దేశవ్యాప్తంగా దిశ బిల్లు తెచ్చేవరకు దీక్ష విరమించను'