అమరావతి రాజధాని భవితవ్యంపై ఉత్కంఠ నెలకొన్న వేళ... ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జీఎన్‌రావు, బోస్టన్, హైపవర్ కమిటీల సిఫారసులకే జై కొట్టింది. అందరూ ఊహించినట్లే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో... 3 రాజధానులకు ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా నాలుగు బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
విశాఖలో సచివాలయం
పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లును ఆమోదించింది. పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపింది. హైకోర్టును కర్నూలు తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయ కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా సాగనుండగా... అమరావతిలో అసెంబ్లీ ఉండనుంది. మంత్రులు రెండుచోట్లా అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకుంది.
సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ
సీఆర్డీఏను రద్దు చేసిన మంత్రివర్గం... కొత్తగా ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలోని ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. రాజధాని రైతు కూలీలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని.. రూ.2,500 నుంచి 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును పది నుంచి పదిహేనేళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై లోకాయుక్త విచారణకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లుగా విభజించాలని నిర్ణయించింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత సూపర్ కలెక్టరేట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపింది. పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన కేబినెట్.. దీనికి అవసరమయ్యే రూ.199 కోట్ల కేటాయింపునకూ ఆమోదం తెలిపింది.