ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నవంబర్ 24న సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో సాక్షుల విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిణి నేతృత్వంలోని ప్రత్యేక కోర్టు... సాక్షులను విచారించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌లో భాగంగా... ప్రాసిక్యూషన్ తరఫున ఏడుగురు సాక్ష్యులకుగాను... ఇద్దరిని ప్రవేశపెట్టారు. నిందితుల తరఫు న్యాయవాది రహీం సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు... విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
విచారణ కంటే ముందే నిందితులు షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూంను జిల్లా జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక కోర్టుకు తరలించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టే సాక్షులను బట్టి... తమ వాదనలు వినిపిస్తామని డిఫెన్స్ న్యాయవాది రహీం పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'పుర' పోరుకు షెడ్యూల్ విడుదల... జనవరి 22న ఎన్నిక