హైదరాబాద్ మహా నగరంలో వార్డుల వారీగా చేపట్టనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమ నిర్వహణపై.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో మేయర్ సమావేశం నిర్వహించారు. నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు మూడు రోజులపాటు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వార్డుల్లో ప్రధాన రహదారులన్నింటిని పూర్తిస్థాయిలో శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేస్తారు. వార్డులో ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను, ఖాళీ స్థలాలు, రహదారుల వెంట ఉన్న పిచ్చి మొక్కలన్నింటిని తొలగిస్తారు.
వార్డులవారిగా శానిటేషన్ ...
నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు మూడు రోజులపాటు విస్తృత శానిటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మేయర్ తెలిపారు. హోటళ్లు, ఫుడ్ వెండర్లు, ఫుట్‌పాత్‌లపై ఆహారాన్ని తయారుచేసే అన్ని రకాల హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో శుభ్రత పాటింపుపై తనిఖీలు నిర్వహించనున్నారు. ఎంటమాలజి విభాగం ద్వారా ఫాగింగ్, లార్వా నివారణ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నారు. వీధి కుక్కల బెడదకు సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించనున్నారు.
ప్లాస్టిక్ నిషేధించండి..
ప్రతివార్డులో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు రెండు బిన్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీ ద్వారా గార్బేజ్‌ను తరలించే వాహనాలన్నింటికి అవసరమైన మైనర్ రిపేర్లను ఈ డ్రైవ్‌లకు ముందుగానే చేపట్టనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు సేకరిస్తున్న 5,600 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్లో.. దాదాపు 40శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: 'చట్టవిరుద్ధమా కాదా అని తేల్చేది కార్మిక న్యాయస్థానమే'