బంజారాహిల్స్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను ఉంచిన సురేశ్ అట్లూరి... తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. పోలీసులు ఠాణాలోనే తన భార్యపై అత్యాచారయత్నం చేశారని... పదిహేను మంది పోలీసులు కలిసి చితకబాదినట్లు సురేశ్ అట్లూరి, ప్రవిజ రెండు రోజుల క్రితం ఫేస్బుక్లో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. వీడియోలో ఎస్సైలతో పాటు... సీఐలపైనా ఆరోపణలు చేసిన నేపథ్యంలో డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఖండించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సురేశ్‌పై కేసులున్నాయని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
పోలీసు విధులకు ఆటంకం కలిగించారని సురేశ్ దంపతులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 8న రిమాండ్‌కు పంపించారు. బెయిల్‌పై బయటికి వచ్చిన అట్లూరి సురేశ్, ప్రవిజ పోలీసులపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే వీడియో సందేశాన్ని ఫేస్బుక్ ఖాతాలో నుంచి తొలగించారు. మతితప్పి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశానని అట్లూరి సురేశ్, అతని భార్య ప్రవిజ మరో వీడియోను విడుదల చేశారు. అత్యాచారయత్నం ఆరోపణల్లో వాస్తవంలేదని వాళ్లే పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమించాలని సురేశ్ దంపతులు కోరారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!