రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్భవన్లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్తో పాటు ఉభయసభల సభాపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గవర్నర్ ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: సీఎం
మాతృభాష విలువ తగ్గించకుండా తాను తెలుగులోనే ప్రసంగిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అవకాశం కల్పిస్తోన్న భారత రాజ్యాంగం... ఏడు దశాబ్దాలుగా పరిపుష్టిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా కర్తవ్యాన్ని నిర్వహించుకోవడంతో రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదామని సీఎం పిలుపునిచ్చారు.
జాతి పునర్నిర్మాణానికి అందరూ ఏకం కావాలి: సీజే
రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలకు కీలక బాధ్యతలు ఉన్నాయని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. జాతి పునర్నిర్మాణానికి అందరూ ఏకం కావాలని అన్నారు. దేశం మనకు ఏం చేసిందనే దాని కంటే... దేశానికి మనం ఏం చేస్తున్నామో గుర్తించాలని సూచించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ... దేశానికి ఆదర్శంగా నిలవాలని జస్టిస్ చౌహాన్ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!