పప్పులు నిప్పులయ్యాయి. నూనెలు మండుతున్నాయి. ఎండుమిర్చి ముట్టుకోకముందే మంటెక్కిస్తోంది. సెల్‌ఫోన్‌కు బదులు బిల్లులు మోతమోగాయి. కూరగాయలూ చుక్కలనంటాయి. ఉల్లి వైపు చూసే ధైర్యమే ఉండట్లేదు. గ్యాస్, పెట్రోలు ధరలు సరేసరి. వెరసి సగటు మనిషి జేబుకు చిల్లు పడుతోంది. ఒక్కో కుటుంబానికి రూ.1500-2000 వరకు అదనపు భారం పడుతోంది. దీనికితోడు డెంగీ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే కుటుంబం అప్పులపాలే. అన్నీ కలిసి మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది.
భగ్గుమంటున్న నిత్యవసరాల ధరలతో మధ్యతరగతి కుటుంబాల ఇంటిఖర్చు గత మూడు నెలల్లో భారీగా పెరిగింది. ఒక్కో కుటుంబానికి రూ.1500-2000 వరకు అదనపు భారం పడింది. దీనికితోడు డెంగీ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే కుటుంబం అప్పులపాలే. అన్నీ కలిసి మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. పట్టణాల్లో నెలకు రూ.15 వేల ఆదాయమున్న కుటుంబాలకు ఇల్లు గడవడమే కష్టంగా మారింది. నిత్యావసరాల ఖర్చులు నెలకు రూ.1,500 వరకు పెరిగాయి. వర్షాల పుణ్యమాని కూరగాయలకు కొరత వచ్చి.. వాటి ధరలూ మిన్నంటాయి. సెప్టెంబరు, అక్టోబరు నాటి ధరలతో పోలిస్తే నవంబరు చివరి నుంచి కూరగాయల ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఉల్లి గరిష్ఠంగా కిలో రూ.155కు చేరింది. రైతుబజార్లలో వెల్లుల్లి కిలో రూ.200 ఉంది. ఎండుమిర్చి గరిష్ఠంగా కిలో రూ.180కి చేరింది. నాణ్యమైన బియ్యం ధర కిలో రూ.55. మినపగుళ్లు కిలో రూ.135కి చేరి, ఇప్పుడు రూ.20 వరకు తగ్గాయి. కంది, పెసర, శనగపప్పుల ధర కిలోకు రూ.20 వరకు పెరిగింది. కోడిగుడ్డు రూ.5కి చేరింది. చికెన్, మటన్ ధరలూ ఎగసి కాస్త తగ్గాయి.
అన్నీ పైపైకే..!
కూరగాయలు, పప్పులే కాకుండా ఇతర ఇంటి ఖర్చులూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇంటి అద్దె ఏడాదికోసారి 5-10% వరకు పెరుగుతుంది. కుటుంబంలో ఇద్దరి మొబైల్ ఛార్జీలకే ఇన్నాళ్లూ రూ.400 అయ్యేవి, తాజా పెంపు తర్వాత రూ.600 కేటాయించాల్సి వస్తోంది. ఇస్త్రీ చేయించాలంటే జత రూ.20 అయింది. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ఇలా ఒకటేమిటి.. అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది క్రితం కేబుల్ టీవీ బిల్లు నెలకు రూ.150-200 మధ్య ఉంటే.. కొత్త విధానంలో రూ.300-400 అయింది. చివరకు మద్యం ధరలూ పెరిగాయి. ఇలా నెలకు ఒక్కో కుటుంబ బడ్జెట్ సగటున 15 శాతం పెరుగుతోంది.
ధరల పెరుగుధల లెక్కలివి..