ప్రశ్నోత్తరాల సమయంలో...
భారత్కు పెట్టుబడుల రాకపై లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు జవాబు ఇచ్చారు అనురాగ్. 2025 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
"గత ఐదేళ్ల పరిస్థితి చూస్తే ప్రపంచంలో వేగంగా దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా ఉంది. 2014 నుంచి 2019 వరకు ఆర్థిక వృద్ధి రేటు 7.5 శాతం నమోదవుతూ వస్తోంది. కాబట్టి ఈ రోజుకీ.. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంటుంది."
- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి
ఉందంటే లేదంటారు
అనురాగ్ సమాధానంపై ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ అభ్యంతరం తెలిపారు.
"వృద్ధిరేటు 5 శాతానికి పడిపోయింది కాబట్టి దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ ప్రభుత్వం వేరేలా చెబుతోంది. ఆర్బీఐ డైరక్టర్ కూడా వ్యాపార వర్గాల్లో నమ్మకం సన్నగిల్లిందని చెప్పారు. మరి దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందని ఒప్పుకోవడానికి సర్కారు సిద్ధంగా ఉందా? ఎందుకంటే.. ప్రభుత్వం ఒకలా చెబుతుంటే, వాస్తవం వేరేలా ఉంది. "
-భగవంత్ మాన్, ఆప్ ఎంపీ
భగవంత్ వ్యాఖ్యల్ని అనురాగ్ తోసిపుచ్చారు.
"వృద్ధి రేటు 5 శాతానికి క్షీణించలేదు. బహుశా ఆయన అభివృద్ధి తగ్గిందని చెప్పాలనుకుంటున్నారేమో. అయినా ఈ పతనం గురించి ఏ ఆర్బీఐ గవర్నర్ చెప్పారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను."
- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి
బ్యాంకుల విలీనం, పరిశ్రమలకు పన్ను రాయితీలు వంటి సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ మరింత పరిపుష్ఠం అవుతుందని చెప్పారు అనురాగ్.
ఇదీ చదవండి:నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు