దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా బడ్జెట్లు మాత్రం ఆశావహ చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. 2020-21 కేంద్ర బడ్జెట్ దీనికి భిన్నంగా ఉండే అవకాశం లేదు. సాధారణంగా పాలక పార్టీలు విజయాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకుని వైఫల్యాలు, ఒడుదొడుకులకు బాధ్యతను పూర్వ ప్రభుత్వాల మీదకు నెట్టేస్తాయి. అలాగే అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్లనే ఆర్థిక ప్రగతి పుంజుకోవడం లేదని చెప్పుకొస్తాయి. తమ విధాన వైఫల్యాలకు ఇతరులను నిందించే అవకాశం చిక్కకపోతే, ఇప్పుడు చెడు అనుకున్నది రేపు మంచిగా మారుతుందని ప్రజలకు నచ్చజెప్పాలనీ చూస్తాయి. అందుకే కష్టాలు తాత్కాలికం, రేపటి జీవితం నందనవనం అని, దేశం బాగు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని బడ్జెట్ రోజుల్లో నేతలు చెబుతుంటారు. ఈసారి దేశాన్ని ఆర్థిక మందగతి, ఉపాధి వ్యాపార నష్టం చుట్టుముట్టాయి. దీనివల్ల పరిస్థితిని చక్కదిద్ది ఆర్థిక రథాన్ని పట్టాలెక్కించడానికి కటువైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రభుత్వం తెగువగా ముందుకెళ్లగలుగుతుంది.
వాస్తవ దృక్పథం అవసరం...
దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన నిజానిజాలు వెల్లడించడానికి ప్రభుత్వం వెనకాడకూడదు. 2016-17లో 8.2 శాతంగా ఉన్న వాస్తవ స్థూలదేశీయోత్పత్తి రేటు 2019-20నాటికి అయిదు శాతానికి పడిపోయినట్లు కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ) వెల్లడించింది. వాస్తవ జీడీపీని ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. ప్రస్తుత మార్కెట్ ధరవరల ప్రాతిపదికన గణించే ‘నామినల్’ జీడీపీ వృద్ధి రేటు గడచిన 44 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కనిష్ఠంగా 7.5 శాతం నమోదైంది. ఫలితంగా దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగింది. జాతీయ నమూనా గణాంక సంస్థ అంచనాల ప్రకారం 2017-’18లో భారత్‌లో నిరుద్యోగిత 6.1శాతంగా ఉంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఒక విష వలయంలో చిక్కుకుని ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు మూడూ నేల చూపులు చూడటం వల్ల జీడీపీ వృద్ధి మందగించింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణముఖం పట్టింది. తద్వారా గిరాకీ మందగించింది. దీనివల్ల వినియోగ, ఉత్పాదక వస్తువుల ఉత్పత్తి పడకేసింది. ఈ ఏడాదీ, నిరుడూ దేశ పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు సగటున 30 శాతానికి మించలేదంటే కారణమిదే. 2011-12లో పారిశ్రామిక పెట్టుబడులు గరిష్ఠంగా 39 శాతం ఉండేవి. ప్రస్తుతం గిరాకీ తగ్గిపోవడం వల్ల పెట్టుబడులూ మందగించాయి. కొనుగోళ్లు మందగించడంతో పరిశ్రమలు తమ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో 30 శాతాన్ని వినియోగించలేకపోతున్నాయి. సేద్య రంగ పరిస్థితీ ఇంతకన్నా మెరుగ్గా ఏమీ లేదు. ఇటీవలి కాలంలో జీడీపీలో వ్యవసాయం వాటా తగ్గిపోతూ వస్తోంది. 2017-18లో వ్యవసాయం అయిదు శాతం వృద్ధి సాధిస్తే, 2018-19లో అది 2.75 శాతానికి క్షీణించింది. భారత స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో 54 శాతంగా ఉన్న సేవారంగం వాటా 2018-19లో కేవలం 7.5 శాతం వృద్ధిరేటు నమోదు చేయగలిగింది. 2017-18లో ఈ రేటు 8.1 శాతంగా నమోదైంది. ఒకవైపు గిరాకీ తగ్గి వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు చతికిలపడటంవల్ల నిరుద్యోగం ప్రబలింది. ఒకవైపు వృద్ధి స్తంభించిపోయి, మరోవైపు ద్రవ్యోల్బణం మోతెక్కుతున్న ప్రస్తుత పరిస్థితులు జాతి జనులను కలవరపెడుతున్నాయి. గడచిన డిసెంబరులో వినియోగ వస్తు ధరల ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరింది. అది అయిదేళ్ల గరిష్ఠం. ఆహార ద్రవ్యోల్బణమైతే ఏకంగా 14.12 శాతానికి చేరింది. 2018 డిసెంబరులో అది మైనస్ 2.65 శాతంగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి మూల కారణం ఉల్లిగడ్డలు, ఇతర కూరగాయల ధరలు పెచ్చరిల్లడమే. ఆహార ధరల పెరుగుదలలో 60.5 శాతానికి ఇదే కారణం. ఆర్థిక వ్యవస్థ స్తంభించిన సమయంలో ద్రవ్యోల్బణం పైకి ఎగబాకడం ఎంత మాత్రం మంచిది కాదు. నిర్మాణ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాలు. సరిగ్గా ఆ రంగాలే ఇప్పుడు దెబ్బతిన్నాయి. నిరుద్యోగంవల్ల ప్రజల ఆదాయాలు కోసుకుపోయి వారి కొనుగోలు శక్తి క్షీణించింది. దాంతో దేశంలో వస్తుసేవలకు గిరాకీ తగ్గిపోయింది. వస్తుసేవల ఉత్పత్తికి అవసరమైన కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో పెట్టుబడులకోసం బ్యాంకు రుణాలు తీసుకునేవారు బాగా తగ్గిపోయారు. మరోవైపు గతంలో తీసుకున్న పెట్టుబడులు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా మారి బ్యాంకులను పీడిస్తున్నాయి. పాత రుణాలు తిరిగి రాక, కొత్త అప్పులు ఇవ్వలేక బ్యాంకులు ఒత్తిడికి లోనవుతున్నాయి. 2019 సెప్టెంబరు నాటికి ఎన్‌పీఏలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. అవి మున్ముందు మరింత పెరగనున్నాయి. ఉద్యోగాలు అడుగంటి, వ్యాపారాలు దెబ్బతింటే ప్రభుత్వానికి పన్ను వసూళ్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ప్రస్తుత సంవత్సరంలో పన్ను వసూళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు బొర్రెపడుతుందని అంచనా.
ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని భావిస్తూ ప్రభుత్వరంగ సంస్థల్లో తన వాటాలను విక్రయించేస్తోంది. ద్రవ్య లోటును కట్టడి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ వ్యయానికి కోత పెడుతున్నారు. ఈ పరిణామాల కారణంగా బడ్జెట్ పరిమాణం ఏటికేడు కుదించుకుపోతోంది. 2009-10 సంవత్సర బడ్జెట్ జీడీపీలో 17.43 శాతం ఉండగా, 2019-20లో అది 13.20 శాతానికి తగ్గిపోయింది. పన్ను వసూళ్లు పడిపోయి, విత్త లోటు కట్టడి కోసం ప్రభుత్వం తన వ్యయానికి పరిమితులు విధించుకోవడంవల్ల నూతన పెట్టుబడులు పెట్టలేకపోతోంది. వివిధ రంగాలకు కేటాయిస్తున్న నిధులు అసలే చాలీచాలని విధంగా ఉంటున్నాయి. పైపెచ్చు అత్యవసర సేవల కోసం ఎప్పటికప్పుడు ఆ నిధులనే వాడేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఉత్పాదక కార్యక్రమాల కోసం నిధులు వెచ్చించలేకపోతోంది. మౌలిక వసతులపై కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతోంది. 2019-20 బడ్జెట్ కింద ఖర్చు చేసిన ప్రతి రూపాయిలో 23 పైసలను పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద చెల్లించారు. మిగిలిన 77 పైసల్లో 47 పైసలను (లేదా 61 శాతం నిధులను) తప్పనిసరి చెల్లింపులకు వెచ్చించారు. ఈ తప్పనిసరి వ్యయంలో వడ్డీలు (23 శాతం), రక్షణ (12 శాతం), సబ్సిడీలు (10 శాతం), ఆర్థిక కమిషన్ల బదిలీ (9 శాతం), పింఛన్లు (7 శాతం) ఉన్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర పథకాలకు, ఇతర వ్యయాలకు మిగిలేది 39 శాతమే. ఏటా బడ్జెట్ పరిమాణం తగ్గిపోతున్నందువల్ల ఈ శాతమూ క్షీణిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం వల్ల ప్రభుత్వానికి ఆశించినన్ని నిధులు సమకూరలేదు. 2019-20లో ఈ మార్గంలో రూ.1,05,000 కోట్లు సంపాదించాలని ప్రభుత్వం లక్షించినా, అందులో ఇప్పటివరకు 20 శాతం మాత్రమే సమకూర్చుకోగలిగింది.
ప్రభుత్వ చొరవే కీలకం...
ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ప్రభుత్వం ఏం చేయగలదన్న ప్రశ్న అనివార్యంగా తలెత్తుతుంది. దానికి జవాబు సుస్పష్టమే. వస్తుసేవలకు గిరాకీ పెంచడం, దాన్ని తీర్చడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, తద్వారా ఉపాధిని పెంచడం వినా మరో మార్గం లేదు. ఈ పని జరిగినప్పుడు వినియోగదారులు, ఉత్పత్తిదారుల్లో ఆర్థికంగా ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. ప్రజల్లో, పరిశ్రమల్లో వృద్ధి ఆశలు చిగురిస్తాయి. అలా ఏర్పడే సానుకూల వాతావరణంలో పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి. కేంద్ర ప్రభుత్వమూ తన వ్యయాన్ని పెంచాలి. కానీ, దీనంతటికీ డబ్బు కావాలి. చెల్లించే స్తోమత ఉన్నవారి మీద ఎక్కువ పన్నులు వేసి ఆదాయం పెంచుకోవాలి. మధ్యతరగతివారికి పన్ను రాయితీలిచ్చి, వారి చేతిలో ఎక్కువ డబ్బు మిగిలేట్లు చూడాలి. ఆ మిగులు డబ్బుతో వారు వస్తుసేవలపై ఎక్కువ ఖర్చు చేయగలుగుతారు. తద్వారా గిరాకీ పెరుగుతుంది. కొనుగోళ్లు పెరిగితే పరిశ్రమలూ తమ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటాయి. ఫలితంగా కొత్త పరిశ్రమలూ వస్తాయి. పెట్టుబడులు ధారాళంగా ప్రవహించి ఆర్థిక వ్యవస్థలో ధన ప్రవాహం ఊపందుకుంటుంది. నూతన ఉత్సాహం ఉప్పొంగి వృద్ధిరేటు తెరిపినపడుతుంది. దీనంతటికీ ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాలి. ఆర్థికాభివృద్ధి పుంజుకొని పన్నుల ఆదాయం సమకూరేవరకు బాగా అప్పులు చేయాల్సి ఉంటుంది. విత్తలోటును ఫలానా శాతానికి పరిమితం చేయాలి కాబట్టి బడ్జెట్‌లో అంకెల గారడీ చేయాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచినా విత్త లోటును తక్కువచేసి చూపడమన్నమాట. ప్రభుత్వం స్వయంగా అప్పులు చేయకుండా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), ‘నాబార్డ్’ వంటి ప్రభుత్వరంగ సంస్థల చేతుల మీదుగా ఆ ప్రక్రియలు చేపట్టాల్సి రావచ్చు. ఈ అప్పులను బడ్జెట్ లెక్కల్లో చూపకుండా విత్త లోటును తక్కువ చేసి చూపవచ్చు. వాటిని తీర్చే భారం నుంచి మాత్రం ప్రభుత్వం తప్పించుకోలేదు. దీని బదులు ప్రభుత్వమే స్వయంగా అప్పులు చేసి, ఆ విషయాన్ని బాహాటంగా పారదర్శకంగా వెల్లడిస్తే ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక వ్యవస్థకు ఊపు తెచ్చి అదనపు ఆదాయం ఆర్జించి, బాకీలను తీర్చాలి. వృద్ధిరేటు పుంజుకొంటే నిరుద్యోగం తగ్గిపోతుంది. ప్రభుత్వం ఎంత అప్పులు చేసినా అవి ఎన్‌కే సింగ్ సమీక్షా సంఘం సిఫార్సు చేసిన విత్త లోటు పరిమితిని మించకూడదు. ఆర్థిక మందగమనాన్ని అధిగమించడం కోసం బడ్జెట్లో సూచించిన విత్త లోటు కన్నా 0.5 శాతం ఎక్కువ లోటును తాకవచ్చునని ఆ సంఘం సూచించింది. సంక్షోభం నుంచి బయటపడే మార్గంగా ఈ సిఫార్సును ప్రభుత్వం ఉపయోగించుకొనే అవకాశాల్ని కొట్టిపారేయలేం!
- పీఎస్ఎమ్ రావు, రచయిత, అభివృద్ధి వ్యవహారాల ఆర్థికవేత్త