దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 100 శాతం ఎలక్ట్రానిక్ టోల్ వసూలుకు కేంద్రం సమాయత్తమవుతోంది. డిసెంబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ టోల్ విధానం తప్పనిసరి చేయనున్నట్లు రోడ్డు రవాణా,రహాదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించడం సహా ఇతర సమస్యలను తొలగించేందుకు కేవలం ఫాస్టాగ్‌ల ద్వారా మాత్రమే టోల్ రుసుముల చెల్లింపులు జరిపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఏఈటీసీ) పేరుతో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ విధానం అమలైనప్పటికీ టోల్ ప్లాజాల ఒక వద్ద హైబ్రిడ్ లైన్‌ను ఉంచనున్నట్లు వెల్లడించింది కేంద్రం. ఈ లైన్లో ఫాస్టాగ్ సహా అన్ని విధానాల్లో చెల్లింపులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు..
దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద 100 శాతం ఎలక్ట్రానిక్ టోల్ వసూలు (ఈటీసీ) ప్రక్రియను అమలు చేసేందుకు రాష్ట్రాల వారీగా ప్రభారీ అధికారులను నియమించింది కేంద్రం.
ఈటీసీ విధానాన్ని పర్యవేక్షిస్తూ జాతీయ రహదారుల అథారిటీ(ఎన్హెచ్ఏఐ) తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, సమస్యలను పరిష్కరించటమే వీరి కర్తవ్యం.
ఇతర కీలక అంశాలు..
- దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్లను ఫాస్టాగ్ ఆధారిత చెల్లింపులు జరిపేందుకు సిద్ధం చేసింది ఎన్హెచ్ఏఐ.
- దేశవ్యాప్తంగా మొత్తం 23 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, అమెజాన్, పేటీఎంలో ఫాస్టాగ్‌లు కొనుగోలు చేసే వీలుంది.
- నేరుగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌లను కొనే సౌకర్యం ఉంది.
- ప్రస్తుతం ఈ విధానం ప్రారంభదశలో ఉన్న కారణంగా త్వరగా వినియోగదారులను ఆకర్షించేందుకు 2.5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఇస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఈ ఆఫర్ ఉండనుంది.
- ఎన్హెచ్ఏఐ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 60 లక్షల ఫాస్టాగ్‌లు జారీ అయ్యాయి.
- ఫాస్టాగ్‌ల ద్వారా మొత్తం రూ.12,850 కోట్లు ఈటీసీ పద్ధతిలో గడించింది ఎన్హెచ్ఏఐ.
ఇదీ చూడండి: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ల సందడి.. అవేంటో తెలుసా?