ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమయింది. నిమిషమైనా దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాం. భారతీయులు తమ ఫోన్లకు అందమైన కవర్లు వేయడం సహా, హెడ్‌ఫోన్లు, పవర్ బ్యాంకులనూ అధికంగా వినియోగిస్తుంటారు. డిస్ప్లే పాడవకుండా వేసే స్క్రీన్ గార్డ్‌ల మార్కెట్టూ ఎక్కువే. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు స్మార్ట్ఫోన్లకూ బీమా పాలసీలు అనివార్యం అయిపోయాయి. ఫోను పోయినా, నీళ్లలో పడ్డా.. కిందపడి స్క్రీన్ పగిలిపోయినా దీని ద్వారా రక్షణ లభిస్తుంది. ఇవే కాకుండా.. కొన్ని ముఖ్యమైన అంశాల్లోనూ ఈ పాలసీలు తోడుగా ఉంటున్నాయి.
వారంటీ పొడగింపు..
ఫోన్ తయారీ సంస్థలు సాధారణంగా ఏడాది పాటు వారంటీని అందిస్తుంటాయి. దీన్ని పొడిగించేలా 'ఎక్స్‌టెండెడ్ వారంటీ' పాలసీలు తోడ్పడతాయి. ఫోను కోసం దీన్ని తీసుకున్నప్పుడు మూడేళ్ల పాటు వారంటీని పొడిగించుకోవచ్చు. ఫోనులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. దాన్ని బాగు చేయడానికి ఈ వారంటీ ఉపయోగపడుతుంది. ఫోన్ దొంగతనం జరిగినా, కిందపడి పగిలిపోయినా ఈ పాలసీ కింద పరిహారం లభించదు.
సైబర్ పాలసీ..
జేబులో నుంచి దొంగతనంగా డబ్బు కొట్టేసే వారున్నట్లే.. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు పెరిగిపోయారు.. మనకు తెలియకుండానే.. మన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి ఉన్న డబ్బంతా కొల్లగొట్టేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడి నష్టపోయినప్పుడు పరిహారం ఇచ్చేవే సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు. ఆన్‌లైన్ మోసాలు, సమాచారం తస్కరణ ద్వారా కలిగే నష్టంలాంటి వాటిని ఈ పాలసీలు భరిస్తాయి.
గృహ బీమాలో..
ఖరీదైన వస్తువులు ఉండే ఇంటికి గృహ బీమా అవసరం పెరిగింది. మీకు ఇప్పటికే ఈ పాలసీ ఉంటే.. అందులో మీ ఫోనునూ చేర్చండి. ప్రపంచ వ్యాప్తంగా ఫోనుకు బీమా వర్తించేలా చూసుకోండి. అప్పుడు దొంగతనం జరిగినా.. ప్రమాదవశాత్తు కిందపడినా.. ఈ బీమా ద్వారా పరిహారం లభిస్తుంది.
-తపన్ సింఘేల్ ఎండీ-సీఈఓ బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్
ఇదీ చూడండి: సమ్మె సైరన్: ఈనెల 31, ఫిబ్రవరి 1న బ్యాంకులు బంద్