4కే.. ఇప్పటివరకు మనకు తెలిసిన పూర్తి స్పష్టమైన తెర. ఇక ఈ సాంకేతికతకు స్వస్తి పలికేందుకు 8కే తెరతో ముందుకు రానున్నాయి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు శాంసంగ్, ఎల్జీ. 8కేతోపాటు అనేక కొత్త అంశాలను జోడించి హై ఎండ్ టీవీలను అందించబోతున్నాయి.
అమెరికా లాస్‌వెగాస్‌లో జరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్ ప్రదర్శన(సీఈఎస్-2020)లో తమ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించాయి ఈ సంస్థలు.
శాంసంగ్ 'సెరో'
సెరో పేరుతో 88 అంగుళాల 8కే స్మార్ట్ టీవీని రూపొందించింది శాంసంగ్. సెరో అంటే నిలువు అని కొరియా భాషలో అర్థం. ఈ టీవీని మొబైల్ తరహాలో వర్టికల్ మోడ్‌లోనూ ఉపయోగించవచ్చు. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌ను వైఫై ద్వారా టీవీకి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్‌లో వర్టికల్ మోడ్‌లో ఉన్న వీడియోలను చూసేందుకు మీరు మొబైల్‌ను తిప్పితే.. సెరో కూడా నిలువుగా మారుతుంది.
"మనం సాధారణంగా ఫోన్‌ను నిలువుగానే ఉపయోగిస్తాం. ఈ వినియోగం కారణంగానే వీడియో చిత్రీకరణల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మొబైల్లో ఎక్కువగా వర్టికల్ మోడ్‌లోనే దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. అయితే నిలువుగా వీడియోలను ప్రదర్శించే సాంకేతికతను ఇప్పటివరకు ఏ టీవీ అందించలేదు."
-గ్రేస్ డొలాన్, శాంసంగ్ ఉపాధ్యక్షులు, అమెరికా
సెరోతో పాటు క్యూ950 పేరుతో మరో 8కే క్యూఎల్ఈడీ టీవీని ఆవిష్కరించింది శాంసంగ్. ఈ మోడల్లో 99శాతం స్క్రీన్-బాడీ నిష్పత్తితో టీవీ తెరను రూపొందించింది.
ఎల్జీ సిగ్నేచర్
మరో దిగ్గజ సంస్థ ఎల్జీ కూడా ఈ ఏడాది 8కే మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ ఏడాది మొత్తం 13 వేరియంట్లను అందించనుంది. ఇందులో హైఎండ్ మోడల్‌గా 88 అంగుళాలతో ఎల్జీ సిగ్నేచర్‌ను ఆవిష్కరించింది.
ప్రస్తుతానికి 8కే రిజల్యూషన్‌తో ఎలాంటి వీడియోలు లేకున్నా రాబోయే కాలంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఎల్జీ భావిస్తోంది. అందుకే ఈ ఏడాది 8కే టీవీలపై దృష్టి పెట్టినట్టు సంస్థ తెలిపింది.
ఇదీ చూడండి: శాంసంగ్ నుంచి ప్రీమియం ఫీచర్లతో రెండు బడ్జెట్ ఫోన్లు