మొండి బకాయిలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 2019-20 డిసెంబర్ త్రైమాసికంలో రూ.429.28 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది.
ప్రభుత్వ బ్యాంకైన పీఎన్బీ గతేడాది ఇదే సమయంలో రూ.246.51 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019-20 సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.507.05 కోట్ల లాభం నమోదు చేయడం గమనార్హం. తాజా త్రైమాసికంలో పీఎన్బీ మొత్తం ఆదాయం రూ.15,967.49 కోట్లు రాగా, గతేడాది ఇదే కాలంలో రూ.14,854.24 కోట్లుగా ఉంది. అయితే గతేడాది రూ.2,565.77 కోట్లున్న మొండిబకాయిలు, ఈ ఏడాది రూ.4,445.36 కోట్లుకు పెరిగిపోయాయి.
ఏకీకృత ప్రాతిపదికన
2019-20 డిసెంబర్ త్రైమాసికంలో... పీఎన్బీ రూ.501.93 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. 2018-19 ఇదే సమయంలో బ్యాంకు ఏకీకృత నష్టం కేవలం రూ.249.75 కోట్లు మాత్రమే. మొత్తంగా చూసుకుంటే ఈ త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.16,211.24 కోట్లు. గతేడాది ఇది రూ.15,104.94 కోట్లుగా ఉంది. దీనికి ప్రధానకారణం గతేడాది రూ.2,636.09 కోట్లున్న మొండిబకాయిలు రూ.4,471 కోట్లకు పెరిగిపోవడమే. పీఎన్బీ ఏకీకృత ఫలితాల్లో దాని 5 అనుబంధ సంస్థలు, ఏడు అసోసియేట్ కంపెనీలు, ఒక జాయింట్ వెంచర్ నుంచి వచ్చిన ఆదాయాలు కలిసి ఉన్నాయి.
నిరర్ధక ఆస్తులు
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నిరర్ధక ఆస్తులు గుదిబండలా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే గతేడాది 16.33 శాతంగా ఉన్న నిరర్ధక ఆస్తులు ఈ ఏడాదికి స్వల్పంగా తగ్గి 16.30 శాతానికి చేరుకున్నాయి.
పీఎన్బీ ఇన్సూరెన్స్ బ్రోకింగ్
నష్టాలతో, మొండి బకాయిలతో, నిరర్ధక ఆస్తులతో సతమతమవుతున్న పీఎన్బీ... 2011 ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కోసం పొందిన లైసెన్స్‌ను వదులుకుని.. దానిని మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.