హైబ్రీడ్ సెట్ టాప్ బాక్స్.. దేశ ప్రసార రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న నయా ట్రెండ్. ఇంతకీ ఏంటి ఈ హైబ్రీడ్ సెట్ టాప్ బాక్స్.. దీని ఉపయోగమెంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శాటిలైట్ టీవీతో పాటు.. వీడియో స్ట్రీమింగ్ (ఓటీటీ) కంటెంట్ వీలుగా వీలుగా ఉండటమే ఈ హైబ్రీడ్ సెట్ టాప్‌బాక్స్ ప్రత్యేకత.
హైబ్రీడ్ సెట్ టాప్ బాక్స్ ఎందుకు?
వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు వీడియో కంటెంట్‌ను ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత మొబైళ్లు, ల్యాప్‌టాప్‌ల్లో వీడియో కంటెంట్‌ను వీక్షించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. టీవీల్లో కేవలం శాటిలైట్ ఛానెళ్లు మాత్రమే ప్రసారం కావడం వల్ల వీక్షకుల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు డీటీహెచ్ ఆపరేటర్లు, ఛానెళ్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అమెజాన్ ఫైర్ స్టిక్‌తో టీవీల్లోనూ వీడియో స్ట్రీమింగ్ కంటెంట్‌ను వీక్షించే వీలున్నా.. దేశంలో దాని వినియోగం అంతగా లేదు. ఈ కారణంగా టీవీల్లో శాటిలైట్ ఛానెళ్లతో పాటు.. వీడియో స్ట్రీమింగ్ కంటెంట్‌ను వీక్షించే వీలు కల్పించాలని ప్రణాళిక రూపొందించాయి డీటీహెచ్ సంస్థలు. ఇందులో భాగంగానే హైబ్రీడ్ సెట్ టాప్ బాక్స్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.
హైబ్రీడ్ సెట్‌టాప్ బాక్స్ ఎలా పని చేస్తుంది?
ఈ హైబ్రీడ్ సెట్‌టాప్ బాక్స్‌లకు ఇంటర్నెట్ అనుసంధానం చేసే వీలుంటుంది. అంతేకాదు వీడియో స్ట్రీమింగ్ సేవలందించే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, హాట్‌స్టార్ వంటి అప్లికేషన్లు ముందుగానే ఇన్స్టాల్ చెసి ఉంటాయి. ఏ సేవలు వినియోగించుకోవాలనుకుంటే వాటికి ప్రీమియం చెల్లించి కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఇదే సెట్బాక్స్కు డిష్ అనుసంధానం చేసే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా శాటిలైట్ టీవీ ఛానెళ్లను వీక్షించొచ్చు. ఈ రెండింటినీ నియంత్రించేందుకు ఒకే రిమోట్‌ను వినియోగించడం దీని ప్రత్యేకత.
మార్కెట్లో ఉన్న హైబ్రీడ్ సెట్ టాప్ బాక్స్‌లు ఇవే..
హైబ్రీడ్ సెట్టాప్బాక్స్ను ముందుగా పరిచయం చేసింది ఎయిర్టెల్ అనే చెప్పాలి. ఎయిర్టెల్ ఇంటర్నెట్ టీవీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది ఆ సంస్థ. ఆండ్రాయిడ్ టీవీతో పని చేసే ఈ సెట్ టాప్ బాక్స్‌తో శాటిలైట్ ఛానెళ్లు, వీడియో స్ట్రీమింగ్ కంటెంట్‌ను చూసే వీలుంది. ఇటీవలే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ పేరుతో మరో హైబ్రీడ్ సెట్‌టాప్ బాక్స్‌ను ఆవిష్కరించింది. డీటీహెచ్‌లలో మరో ప్రముఖ సంస్థ డిష్‌టీవీ.. డిష్ స్మార్ట్‌హబ్ పేరుతో హైబ్రీడ్ సెట్‌టాప్ బాక్స్‌ను తీసుకువచ్చింది. జియో ఆవిష్కరించిన 4కే-సెట్‌టాప్ బాక్స్ ఇదే కోవలోకి వస్తుంది.
ఇదీ చూడండి: ఇన్ఫోసిస్‌పై మరో లేఖాస్త్రం.. సీఈఓనే లక్ష్యం..!