భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) నేటి నుంచి మూడు కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. మీరు ఎస్బీఐ ఖాతాదారులు అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
ఏటీఎం లావాదేవీలకు ఓటీపీ
ఎస్బీఐ ఖాతాదారులు రూ.10,000లకు పైగా ఏటీఎం ద్వారా నగదు డ్రా చేయాలంటే నేటి నుంచి ఓటీపీ ఇవ్వాల్సి వస్తుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య జరిగే లావాదేవీలపై ఈ నిబంధన వర్తించనుంది.
ఎస్బీఐ పాత డెబిట్‌కార్డులు ఇకపై చెల్లవ్..
ఎస్బీఐ మ్యాగ్నటిక్ స్ట్రిప్స్ డెబిట్ కార్డులు నేటి నుంచి పని చేయడం మానేశాయి. ఈ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ కార్డుకు అప్డేట్ చేసుకోవాలని ఖాతాదారులకు ఇప్పటికే సూచించింది ఎస్బీఐ. ఆన్లైన్ లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు ఈ కార్డులను తీసుకువచ్చింది ఎస్బీఐ.
స్టేట్ బ్యాంక్ రుణాలు మరింత చౌక..
'ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత వడ్డీ రేటు' (ఈబీఆర్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ఎస్బీఐ. ఈ వడ్డీ రేట్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పుడున్న ఈ కీలక వడ్డీ రేటు 8.05 నుంచి 7.80 శాతానికి దిగిరానుంది.