దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కాల్స్, డేటా ఛార్జీలు పెంచింది. ప్రీపెయిడ్ వినియోగదారులకు.. పెంచిన కొత్త ఛార్జీలు ఈ నెల 3 నుంచి అమలు కానున్నున్నట్లు ఎయిర్‌టెల్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఛార్జీలను పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొన్న కొద్ది సేపటికే.. ఎయిర్‌టెల్ కూడా ఛార్జీల పెంపు ప్రకటన వెలువడటం గమనార్హం.
ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ ప్లాన్ల ధరలు పెంచిన ఛార్జీలు.. ప్రస్తుతంకన్నా 50శాతం ఎక్కువగా ఉండనున్నాయి.
"ఎయిర్‌టెల్ టారీఫ్ పెంపు చాలా తక్కువ. నూతన ప్లాన్స్‌లో పెంచిన ధరలు రోజుకు 50పైసాలు- రూ. 2.86 మధ్య ఉంటాయి. డేటా, కాల్స్ సదుపాయాలను ఎయిర్‌టెల్ ఎంతో ఉదారంగా అందిస్తోంది."
ఎయిర్‌టెల్ ప్రకటన
ఎయిర్‌టెల్ పెంచిన ఛార్జీల వివరాలు ఇవి..
నూతన ప్లాన్లలో 50శాతం వరకు పెరుగుదల ఉంటుందని తెలిపింది ఎయిర్‌టెల్. అన్‌లిమిటెడ్ విభాగంలో వార్షిక ప్యాక్ అత్యధికంగా 50శాతం పెరిగి 998 రూపాయల నుంచి 1,499 రూపాయలకు చేరింది. మరో వార్షిక ప్లాన్ 41.2 శాతం పెరిగి.. 1699 నుంచి 2వేల 398కు పెరిగింది.
84 రోజుల పాటు ఉండే ప్యాక్ 31 శాతం పెరిగి 458 రూపాయల నుంచి 599 రూపాయలకు చేరింది. ప్రస్తుతం 28 రోజుల కాలపరిమితితో ఉన్న 249 రూపాయల ప్లాన్ ధరను 298 రూపాయలకు పెంచింది. 82 రోజుల కాలపరిమితితో ఉన్న 448 ప్లాన్ ధరను 598 రూపాయలకు పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
నిర్దేశించిన ఎఫ్‌యూపీ లిమిట్ దాటిన తర్వాత చేసే ఇతర నెట్‌వర్క్ కాల్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్‌లతో పాటు అదనంగా మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ వేదికలో భాగంగా.... 10 వేల సినిమాలు, పలు షోలు, 400 టీవీ ఛానళ్లతో కూడిన ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీంను కూడా అందించనుంది. వింక్ మ్యూజిక్, డివైస్ ప్రొటెక్షన్, యాంటీ వైరస్ ప్రొటెక్షన్ సదుపాయాలు కూడా ఎయిర్‌టెల్ వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
ఇదీ చూడండి:జీఎస్టీ వసూళ్ల వృద్ధి.. నవంబర్‌లో మళ్లీ లక్ష కోట్ల ప్లస్