భారతీయ ఆహార పంపిణీ, రెస్టారెంట్ డిస్కవరీ వేదిక జొమాటో.. భారత్‌లోని ఉబర్ ఈట్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. బదులుగా తమ వ్యాపారంలో 9.99 శాతం వాటాను (స్టాక్ డీల్) ఉబర్‌కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఉబర్ ఈట్స్ భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేస్తుంది. డైరెక్ట్ రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాములు, ఉబర్ ఈట్స్ యాప్ వినియోగదారులను జొమాటో ప్లాట్‌ఫామ్‌కు బదిలీచేయనుంది. ఈ ప్రక్రియ నేటి నుంచే అమలు కానుందని జొమాటో వెల్లడించింది.
"భారతదేశంలోని 500కు పైగా నగరాల్లో ఆహార పంపిణీ వ్యాపారాన్ని విస్తరించినందుకు మేము గర్విస్తున్నాం. ఉబర్ ఈట్స్ వ్యాపారం సొంతం చేసుకోవడం మా స్థానాన్ని మరింత గణనీయంగా బలపరుస్తుందని నమ్ముతున్నాం."
- దీపిందర్ గోయెల్, జొమాటో సీఈఓ
అలీబాబా అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్సియల్ నుంచి 3 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ వద్ద జొమాటో 150 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.
జొమాటో...ఉబర్ ఈట్స్
జొమాటో 24 దేశాల్లో 15 లక్షలకు పైగా రెస్టారెంట్ల జాబితాను కలిగి ఉంది. ప్రతి నెలా 7 కోట్ల మందికి పైగా తమ వినియోగదారులకు సేవలు అందిస్తోంది. మరోవైపు 2017లో భారత్‌లోకి ప్రవేశించిన ఉబర్ ఈట్స్... 41 నగరాల్లో సుమారు 26,000 రెస్టారెంట్ల రుచులను తన వేదిక ద్వారా వినియోగదారులకు అందిస్తూ వచ్చింది. అయితే జొమాటో, స్విగ్గీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఉబర్ ఈట్స్ సుమారు రూ.2,197 కోట్ల నష్టాలను చవిచూసింది. అంటే 2019 మొదటి మూడు త్రైమాసికాల్లో 25 శాతానికి పైగా నష్టపోయింది.
ఇకపై రైడ్స్పైనే ఉబర్ దృష్టి
ఆహార పంపిణి వ్యాపారాన్ని వదులుకున్న ఉబర్ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన రైడ్స్ (ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేరవేయడం)పైనే దృష్టి సారించే అవకాశం ఉంది. ఇది సంస్థను లాభదాయకత వైపు నడిపించగలదని అభిప్రాయపడుతోంది.
ఇదీ చూడండి: ఐఎంఎఫ్ తాజా అంచనాలతో నష్టాల్లో మార్కెట్లు