భారత్ టెలికాం రంగాన్ని షేక్ చేస్తున్న రిలయన్స్ జియోకు ఓ స్టార్టప్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేవలం ఒక్క రూపాయికే 1 జీబీ సూపర్‌ఫాస్ట్ వైఫై, అంతర్జాల సేవలు అందిస్తూ ఔరా అనిపిస్తోంది. అదే బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'వైఫై డబ్బా'.
గట్టిపోటీ
భారత టెలికాం రంగంలోకి జియో ఎంట్రీతో డేటా ధరలు అమాంతం దిగొచ్చాయి. ఇతర టెలికాం దిగ్గజాలు కూడా పోటాపోటీగా డేటా ధరలు తగ్గిస్తూ వచ్చాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే ఎక్కువ డేటాను అందిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు వైఫై డబ్బా అనే చిన్న స్టార్టప్ ఈ దిగ్గజాలకు భారీ ఛాలెంజ్ విసిరింది.
రూపాయికే..
బెంగళూరులో 2016లో వైఫై డబ్బా స్టార్టప్ ప్రారంభమైంది. తక్కువ ఖరీదైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్పీ) 1జీబీపీఎస్ హైస్పీడ్‌తో... ప్రీపెయిడ్ ప్లాన్ల కింద కేవలం ఒక్క రూపాయికే 1 జీబీ డేటాను అందిస్తోంది.
సూపర్... నెట్
వైఫై డబ్బా... 2020లో మొత్తం 100 సూపర్ నోడ్స్ వైఫై నెట్‌వర్క్‌ను బెంగళూరు నగరవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. వాస్తవానికి ఇతర కేబుల్ నెట్వర్క్ మాదిరిగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ దీనికి అవసరంలేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సిన పనీలేదు.
ఇందులో ఉపయోగించిన సాంకేతికత వల్ల ఎలాంటి జాప్యం లేకుండా 2 కి.మీ దూరం వరకు కమ్యునికేట్ చేయగలవు. సూపర్ నోడ్ దాని చుట్టూ ఉన్న పరిస్థితులను పర్యవేక్షించడానికి వాతావరణ సెన్సార్, సీసీటీవీ ఉంటాయి.
మొదట్లో థర్డ్‌పార్టీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడిన వైఫై డబ్బా... ఇప్పుడు సొంతంగా సాఫ్ట్వేర్ నెట్‌వర్కింగ్‌ను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం బెంగళూరులో వర్చువల్ టోపోలాజీ మ్యాప్‌ను రూపొందించడానికి కృషి చేస్తోంది. దీని వల్ల సూపర్నోడ్లను ఇన్స్టాల్ చేయడానికి అనుకూలమైన లొకేషన్‌ను సులభంగా ఎంచుకోవచ్చు.
లక్ష్యం ...
ప్రస్తుతం వైఫై డబ్బా బెంగళూరులో పదివేల ప్రదేశాల్లో 1000 హాట్స్పాట్లు నిర్వహిస్తోంది. రూ.2కే 200 ఎంబీ కూడా అందిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలోని టైర్-3 టైల్-4 పట్టణాల్లో తమ సేవలను విస్తరించాలని లక్ష్యం పెట్టుకుంది.
ఎలా?
వైఫై డబ్బా నెట్వర్క్... ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఆసక్తి గల వినియోగదారులు కంపెనీ వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో వైఫై డబ్బా టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగానూ వైఫై డబ్బా టోకెన్లు కొనుగోలు చేయవచ్చు.
ఇదీ చూడండి: పనిచేస్తున్న సంస్థకు పాన్‌కార్డ్ వివరాలు ఇచ్చారా?