వాట్సాప్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి భారీ ముందడుగు పడింది. 'వాట్సప్ పే'కు కీలకమైన రెగ్యూలేటరీ అనుమతులు వచ్చాయి. 'ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (ఎన్‌పీసీఐ) నుంచి విడతలవారీగా డిజిటల్ పేమెంట్స్ సేవలు నిర్వహించేందుకు వాట్సాప్‌కు లైసెన్స్‌లు వచ్చాయని ఆర్‌బీఐ అధికారులు వెల్లడించినట్లు 'బిజినెస్ స్టాండర్డ్' తెలిపింది.
మార్గం సుగమం
ఆర్‌బీఐ నుంచి వాట్సాప్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఎన్‌పీసీఐ అనుమతులు రావడం గమనార్హం. డేటా స్థానికీకరణ నిబంధనలకు అనుకూలంగానే పనిచేస్తామని వాట్సాప్ వెల్లడించడం వల్ల అనుమతులు లభించాయి. గతంలో ఈ కారణంతోనే అనుమతులు ఆలస్యమైనట్లు సమాచారం.
కోటి మందికి
వాట్సాప్ తొలిదశలో భారత్‌లోని కోటి మందికి డిజిటల్ చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయగానే మిగిలిన వారికి కూడా ఈసేవలు అందుబాటులోకి వస్తాయి. వాట్సాప్ ఈ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే దేశంలోనే అతిపెద్ద డిజిటల్ సేవల చెల్లింపు సంస్థగా మారుతుంది. ప్రస్తుతం వాట్సాప్‌కు దాదాపు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
2018 ఫిబ్రవరిలోనే ప్రయోగాత్మకంగా..
వాస్తవానికి వాట్సాప్ చెల్లింపు సేవలను 2018 ఫిబ్రవరిలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. దీనికి ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామిగా ఉంది. ఈ సర్వీసులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్‌లో నిర్వహిస్తారు. దీనిని ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసింది.
ఇదీ చూడండి: ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!