వాణిజ్య యుద్ధాలు, బలహీనమైన వ్యాపార పెట్టుబడులు, నిరంతర రాజకీయ అనిశ్చితి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుభారాన్ని మోపుతున్నాయని, ఇది దీర్ఘకాలిక వృద్ధికి ముప్పు తెస్తుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ- ఓఈసీడీ పేర్కొంది.
ఆర్థికమాంద్యం తరువాత....
2018లో ప్రపంచ జీడీపీ వృద్ధి 3.5 శాతంగా ఉంది. 2019లో ఇది 2.9 శాతంగా ఉంటుందని ఓఈసీడీ అంచనా వేసింది. ఆర్థిక మాంద్యం తరువాత ఇదే కనిష్ఠ వార్షిక రేటు. అలాగే 2020-21లో ప్రపంచ జీడీపీ 2.9 నుంచి 3 శాతం వరకు ఉంటుందని ఓఈసీడీ వెల్లడించింది.
ధైర్యంగా ముందడుగేయాలి
వ్యాపార,వాణిజ్యాల్లో అధికస్థాయి అనిశ్చితితోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న ప్రాథమిక మార్పులను పరిష్కరించడానికి సాహసోపేత చర్యలు అవసరమని ఓఈసీడీ అభిప్రాయపడింది. డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా విధాన రూపకల్పన జరగాలని స్పష్టం చేసింది. అలాగే పెట్టుబడులు పెంచడానికి.. వాణిజ్యం, పన్నులపై న్యాయమైన అంతర్జాతీయ నియమాలను రూపొందించడానికి ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. కర్బన ఉద్గారాల తగ్గింపు ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పింది.
"ద్రవ్య లేదా ఆర్థిక విధానంలో సంభవిస్తున్న మార్పులను తాత్కాలిక కారకాలుగా పరిగణించటం పొరపాటు. ఇవి నిర్మాణాత్మకమైనవి.
ప్రపంచ వాణిజ్యం, పన్నుల వ్యవస్థలో సమన్వయం, ఇంధన పరివర్తనకు స్పష్టమైన విధాన సూచికలు లేకుండా ఉంటే.. అనిశ్చితి ఇంకా పెరుగుతుంది. వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తుంది."
- లారెన్స్ బూన్, ఓఈసీడీ ముఖ్య ఆర్థిక వేత్త
దేశాలను అనుసరించి...
మందగమనం... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్థలపైనా ప్రభావం చూపుతుంది. అయితే దాని తీవ్రత దేశాల వ్యాపార, వాణిజ్య సామర్థ్యాలను అనుసరించి మారుతుంటుంది.
ఇదీ చూడండి: హిట్లర్ జ్ఞాపికలకు వేలంపాటలో రికార్డు ధర!