ఆడికేంట్రా.. పెట్రోల్ బంకు ఓనర్’.. అనే మాట పల్లె, పట్నం అనే తేడా లేకుండా పెట్రోల్‌బంకుల యజమానుల గురించి వినిపించే మాట. ఆదాయం, లాభాలపై భరోసా ఉండటమే ఇందుకు కారణం. అందుకే పెట్రోల్ బంకు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. గతంలో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలే పెట్రోల్ బంకులకు డీలర్‌షిప్‌లు జారీ చేసేవి. తరవాత రిలయన్స్, ఎస్సార్, షెల్ వంటి ప్రైవేటు సంస్థలూ మంజూరు చేస్తున్నాయి. పెట్రోల్ బంకుల సంఖ్య మరింత పెంచేందుకు, చమురేతర కంపెనీలకూ లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి సంఖ్య పెరిగితే వ్యాపారం ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇంధన రిటైల్ నూతన సరళీకృత విధానం ప్రకారం..
ఇప్పటివరకు.. ప్రపంచంలోనే ఇంధన విపణి అధికవేగంతో వృద్ధి చెందుతున్న దేశం మనది. ఇప్పటివరకు పెట్రోల్/డీజిల్ బంకులు స్థాపించాలంటే కర్బన ఇంధనాల వెలికితీత, ఉత్పత్తి, చమురుశుద్ధి, పైపులైన్లు, ఎల్‌ఎన్‌జీ రంగాల్లో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలకు మాత్రమే అవకాశం ఉండేది. 2002 నాటి మార్కెటింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఇవి రూపొందించారు. ఈ విధానంలో చేయాల్సిన మార్పులను అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ సూచించింది.
ఇకపై.. నికరవిలువ రూ.250 కోట్లు ఉన్న ఏ కంపెనీ అయినా కూడా పెట్రోల్‌బంకుల ఏర్పాటుకు లైసెన్స్ కోరుతూ కేంద్రప్రభుత్వానికి రూ.25 లక్షలు చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థలు దేశంలో కనీసం 100 పెట్రోల్‌బంకులు.. ఇందులో 5 శాతం గుర్తించిన మారుమూల ప్రాంతాల్లో అయిదేళ్లలోపుగా నెలకొల్పాల్సి ఉంటుంది. ఒకవేళ మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఇష్టం లేకపోతే, దరఖాస్తు సమయంలోనే ఒక్కోదానికి రూ.2 కోట్ల చొప్పున చెల్లించి, మినహాయింపు పొందొచ్చు. అంగీకరించి, నెలకొల్పడంలో విఫలమైతే, ఒక్కోదానికి రూ.3 కోట్ల చొప్పున జరిమానా విధిస్తారు.
* కార్యకలాపాలు ఆరంభించిన మూడేళ్ల లోపు, ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్‌జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్), బయోఇంధనాలు, ఎల్‌ఎన్‌జీ (ద్రవరూపిత సహజవాయువు)లలో కనీసం ఒకటైనా విక్రయించేందుకు, విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లకు కూడా అవకాశం కల్పించాలి.
లాభాలుండాలంటే..
ప్రభుత్వరంగ మార్కెటింగ్ సంస్థలు దేశంలో కొత్తగా 78,493 ప్రాంతాల్లో కొత్తగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు డీలర్‌షిప్‌లను ఆహ్వానిస్తూ గత ఏడాది నవంబరులోనే ప్రకటనలు ఇచ్చాయి. అయితే ఈ ప్రక్రియ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఒకపక్క విద్యుత్తు వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచాలనే దృక్పథంతో ప్రభుత్వం ఉండగా, ప్రస్తుతం కంటే రెట్టింపునకు మించి కొత్త బంకులు ఏర్పాటైతే ఆర్థికంగా మనలేవని క్రిసిల్ వంటి సంస్థలు విశ్లేషించాయి. కొత్తగా 30,000 బంకులకు మించి అవకాశాలు ఉండవని పేర్కొంది. ఇంతమేరకు అయితే ఆర్థికంగా లాభనష్ట రహిత స్థితికి 12 ఏళ్లకు చేరతాయని, నెలకు 160 కిలోలీటర్ల (కిలోలీటర్= 1000 లీటర్ల) చొప్పున ఇంధన విక్రయాల ద్వారా 12-15 శాతం మార్జిన్ పొందగలుగుతారని అంచనా వేసింది.
- అమెరికాలోనూ 1994లో 2,02,800 గ్యాస్‌స్టేషన్లు ఉండగా, లాభదాయకంగా లేనందున భారీగా మూసివేయడంతో, ప్రస్తుతం 1,50,000 మాత్రమే ఉన్నాయి.
- మనదేశంలో ప్రైవేటు బంకులు జాతీయ రహదారులు, పట్టణాల్లోనూ ఉన్నందున, సగటు విక్రయాలు అధికంగా చేస్తున్నాయి.
అంతర్జాతీయ దిగ్గజాలకు వీలు
తాజా ప్రతిపాదనల వల్ల టోటల్ ఎస్‌ఏ (ఫ్రాన్స్), ఆరామ్‌కో (సౌదీ అరేబియా), బీపీ పీఎల్‌సీ (యునైటెడ్ కింగ్‌డమ్), బహుళజాతి కమొడిటీ ట్రేడింగ్ కంపెనీ ట్రాఫిగరాకు చెందిన పూమా ఎనర్జీ (సింగపూర్) వంటి సంస్థలూ దేశీయంగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ముందుకు రావచ్చు.
- అదానీ గ్రూప్‌తో కలిసి టోటల్ ఎస్‌ఏ సంస్థ 1500 బంకుల ఏర్పాటుకు లైసెన్స్ కోరుతూ 2018 నవంబరులోనే దరఖాస్తు చేసింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో బంకుల ఏర్పాటుకు సిద్ధమైన బీపీ, ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 5500 ఏర్పాటు చేయాలన్నది సంస్థ ఇరుసంస్థల లక్ష్యం. రెండేళ్ల క్రితమే 3500 బంకుల ఏర్పాటుకు లైసెన్స్ పొందినా, బీపీ సొంతగా ముందడుగు వేయకపోవడం గమనార్హం.
- పూమా ఎనర్జీ దరఖాస్తు చేయగా, ఆరామ్‌కో సంప్రదింపులు సాగిస్తోంది.
ఇదీ చూడండి : మరాఠావాదమే శరద్ పవార్ వెనకున్న బలం