భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతానికి చేరుతుందన్న అంచనా ఉంది. వృద్ధి మందగించేందుకు వినియోగ డిమాండ్ పడిపోవటమే ప్రధాన కారణం. వాహన రంగం, స్థిరాస్తి రంగం తదితరాలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. వృద్ధి నెమ్మదించటం వల్ల నిరుద్యోగ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మాంద్యం వేళ నిరుద్యోగం సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రం ఏం చేస్తుందనేదే ప్రశ్న. ఇందుకోసం బడ్జెట్లో ఎలాంటి చర్యలు ప్రతిపాదిస్తుంది? అసలు కేంద్రం ముందున్న మార్గాలేంటి?
అంతర్జాతీయ కారణాలు
వివిధ అంతర్జాతీయ కారణాలు కూడా ఆర్థిక వృద్ధి నెమ్మదించేందుకు కారణమయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం భారత్ పైనా పడుతోంది. ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరాన్ సైనిక దళాల కమాండర్ సులేమానిని అగ్రరాజ్యం చంపేసిన తర్వాత ఇవి మొదలయ్యాయి. దీని ప్రభావం మన దేశంపై కూడా పడింది. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే అంతర్జాతీయ పరిస్థితులను మాత్రమే మందగమనానికి కారణాలుగా చూపించకూడదన్నది నిపుణుల మాట.
వ్యయాన్ని పెంచాలి
స్వల్ప కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత తగ్గించేందుకు ప్రభుత్వం... సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ల నిర్మాణాలపై వ్యయాన్ని పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ వల్ల చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల నిరుద్యోగిత పెరిగిందన్నారు. జీఎస్టీలో ఉత్పత్తయిన వస్తువుల కంటే ముడిసరుకులపైనే ఎక్కువ పన్ను ఉండటం వల్ల అవి పోటీని తట్టుకోలేక సమస్యలను ఎదుర్కొన్నాయని పేర్కొంటున్నారు.
పట్టణాల్లో నిర్మాణ రంగం కార్యకలాపాలు క్షీణించటం వల్ల కూడా ఉపాధి తగ్గిపోయింది. వ్యవసాయ రంగం తరువాత అత్యధిక ఉపాధిని కల్పించే ఈ రంగాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 102 లక్షల కోట్ల రూపాయలను దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
నైపుణ్య శిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఔత్సహికులను ప్రోత్సహించటం ద్వారా నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.