ఎలన్ మస్క్ సంపాదన ఒక్క గంటలోనే దాదాపు 2.3 బిలియన్ డాలర్లు(రూ.16 వేల కోట్లకు పైగా) పెరిగిపోయింది. టెస్లా షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడవుతున్నాయి. అంచనాల కంటే నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటాయనే అంచనాలు.. మోడల్ వై క్రాసోవర్ కారు తయారీ వేగవంతం చేయడం వంటి కారణాలతో నిన్న వాల్‌స్ట్రీట్‌లో ఈ షేర్లు పరుగులు తీశాయి. 580.99 డాలర్లు వద్ద ఈ షేరు ట్రేడింగ్ ముగించింది. ఒక దశలో 12శాతం పెరిగి 649 వద్దకు చేరింది. దీంతో ఈ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద 36 బిలియన్ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్ అంచనా కట్టింది.
ప్రస్తుతం మస్క్ వద్ద టెస్లాలో ఐదోవంతు షేర్లు ఉన్నాయి. ఇక స్పేస్ ఎక్సోప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌లో 14.6 బిలియన్ డాలర్ల షేర్లు ఉన్నాయి. కొన్నాళ్ల కిందటే టెస్లా మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లను దాటేసింది. దీనిని మస్క్ నిలబెట్టుకోగలిగితే ఆయన సంపద భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో మస్క్‌కు 346 మిలియన్ డాలర్లు అందనున్నాయి.
టెస్లా మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటిచినప్పటి నుంచి కంపెనీ షేర్లు దాదాపు రెట్టింపయ్యాయి. చైనాలో మోడల్ వై తయారీ కోసం త్వరలో ప్లాంట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కంపెనీ 2025 నాటికి రెండు నుంచి మూడు మిలియన్ల వాహనాలు విక్రయించనుందని అంచనాలు ఉన్నాయి.