టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్‌పీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌పై సంస్థ వాదనను సుప్రీంకోర్టు ఈనెల 10న ఆలకించే అవకాశముంది. ఈ విషయంలో తమను పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలివ్వవద్దని కోరుతూ సైరస్ మిస్త్రీ, సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొన్ని సంస్థలు కూడా కేవియెట్ దాఖలు చేశాయి. శీతాకాలం సెలవుల (రెండు వారాల) అనంతరం సుప్రీంకోర్టు సోమవారం పునఃప్రారంభమైంది. తొలిరోజే తమ పిటిషన్‌ను విచారించాలని టాటా సన్స్ కోరుతుందని ఒక న్యాయవాది తొలుత పేర్కొన్నా, అది నిజం కాలేదు. సంస్థ నుంచి ఈ దిశగా అభ్యర్థించేందుకు అనుమతులు రాలేదని సమాచారం.
తీర్పును సవరించేందుకు ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కరణ:
టాటా-మిస్త్రీ కేసు తీర్పులో సవరణలు చేయాలన్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) అభ్యర్థనను ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కరించింది. టాటా సన్స్‌ను ప్రైవేటు కంపెనీగా మార్చేందుకు అనుమతులివ్వడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఇచ్చిన తీర్పులో, ఆర్‌ఓసీపై ఎటువంటి ఆంక్షలూ విధించలేదని గుర్తు చేసింది.
విభేదాలు పరిష్కరించుకోండి:
పరువునష్టం దావా కేసులో పరస్పరం చర్చించుకుని, విభేదాలు పరిష్కరించుకోవాలని టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, బోంబేడైయింగ్ ఛైర్మన్ నుస్లీవాడియాలకు సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. టాటా గ్రూప్ సంస్థల బోర్డుల నుంచి తనను తొలగించడంపై ఆగ్రహించిన నుస్లీవాడియా, రతన్ టాటా- టాటా సన్స్ డైరెక్టర్లపై 2016లో క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలు చేశారు.
ఇదీ చూడండి: రూ.58 వేలు విలువైన పరికరం రూ.500కే తయార్!