రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ) నెలవారీగా డబ్బును పొదుపు చేసేవారికి ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. పొదుపు ఖాతా కంటే ఆర్‌డీ ఖాతాలో ఎక్కువ వడ్డీ పొందవచ్చు. ఆర్‌డీ అనేది బ్యాంకులు ఆఫర్ చేస్తోన్న టర్మ్ డిపాజిట్. ఇందులో ఖాతాదారులు ముందుగా నిర్ణయించిన కాలానికి ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని ప్రతీనెల ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. నెలవారీగా జమ చేయాల్సిన మొత్తాన్ని ఒకసారి నిర్ణయించిన తరువాత మార్చుకునేందుకు వీలుండదు. ఆర్‌డీ ఖాతాను బ్యాంకులో లేదా పోస్టాఫీసులో తెరవవచ్చు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్టాఫీసు రెండింటిలోనూ ఆర్‌డీ ఖాతా అందుబాటులో ఉంది.
ఎస్‌బీఐ, పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్లను పరిశీలిస్తే…
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2019, సెప్టెంబరు 10 నుంచి రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. సాధారణ ప్రజలకు ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేట్లు 5.8-6.25 శాతం మధ్య మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు మేర అదనపు వడ్డీని ఎస్‌బీఐ ఆఫర్ చేస్తోంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ల వార్షిక వడ్డీ రేటు 7.2 శాతంగా ఉంది. మూడు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తారు. ఈ వడ్డీ రేట్లు అక్టోబరు 1 నుంచి అమలులోకి వచ్చాయి.
- ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతా గడువు 12 నెలల నుంచి 120 నెలల వరకు ఉంటుంది. అదే పోస్టాఫీస్ ఆర్‌డీ గడువు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే.
- ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ ఖాతాను చెక్ లేదా నగదును ఉపయోగించి ప్రారంభించవచ్చు. పోస్టాఫీస్‌లో ఆర్‌డీ ఖాతాను నగదుతోనే తెరిచేందుకు వీలుంటుంది.
- ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ ఖాతాను నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రారంభించవచ్చు. పోస్టాఫీస్‌లో ఆర్‌డీ ఖాతాను ప్రారంభించేందుకు తపాలా శాఖకు వెళ్లాల్సి ఉంటుంది.
- ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాదారులు నెలకు కనీసం రూ.100 నుంచి 10 గుణిజాలలో ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. దీనికి ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. పోస్టాఫీస్ ఆర్‌డీని ప్రారంభించేందుకు నెలకు కనీసం రూ.10 అవసరం. 5 గుణిజాలలో ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. ఎలాంటి పరిమితి లేదు.
- పోస్టాఫీసు ఆర్‌డీ ఖాతాపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఎస్‌బీఐ వడ్డీ రేటు కాలానికి అనుగుణంగా మారుతుంటుంది.
డిపాజిట్ ఆలస్యమైతే..
ఒకవేళ ఒక నెలలో ఖాతాలో డిపాజిట్ చేయకపోతే ఎస్‌బీఐ ఛార్జీలను విధిస్తుంది. ఐదేళ్లు అంతకంటే తక్కువ కాలవ్యవధి ఉన్న ఖాతాలకు రూ.100 కు రూ.1.50 చొప్పున వసూలు చేస్తుంది. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాలో సమయానికి డిపాజిట్ చేయకపోతే ప్రతి 5 రూపాయిలకు రూ.0.05 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. వరుసగా నాలుగు సార్లు డిపాజిట్ చేయకపోతే ఖాతా నిలిచిపోతుంది. తిరిగి రెండు నెలల్లో దీనిని పునరుద్ధరించుకోవచ్చు. అయితే ఈ కాలంలో తిరిగి ప్రారంభం కాకపోతే తర్వాత డిపాజిట్ చేసేందుకు వీలుండదు.
ఇదీ చూడండి: మీరు జియో కస్టమరా? అయితే ఇది మీకోసమే...