ఆర్‌బీఐ మధ్యంతర ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 5.15 శాతం మార్చలేదు. ఇలా చేయడం ఇది రెండోసారి. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి అవసరమైన విధాన వైఖరి కొనసాగిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ చేపట్టిన చివరి సమీక్ష ఇదే. అయితే 2019-20లో 5 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు... 2020-21లో 6 శాతానికి చేరుకోవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
"ఆర్థిక కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నాయి. ఇటీవల పెరిగిన కొన్ని సూచికలు ఇంకా విస్తృత ఆధారిత పద్ధతిలో పుంజుకోలేదు. ద్రవ్యోల్బణ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం సముచితమైమని ఎంపీసీ భావించింది."- ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ)
ఆరుగురు సభ్యుల కమిటీ కీలక వడ్డీరేట్లు విషయంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అయితే భవిష్యత్లో ఈ రేట్లు తగ్గించే అవకాశముందని సూచించింది. 2019 ఫిబ్రవరి- అక్టోబర్ మధ్య ఆర్‌బీఐ రెపోరేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది.