ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మనీ త్వరలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సర్వీసులను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆ సంస్థకు ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజీ బోర్డు(సెబీ) నుంచి అనుమతులు కూడా లభించాయి. ఈ మేరకు పలు వివరాల్ని ఆ సంస్థ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ట్రేడింగ్ సేవలు
‘స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఎదురు చూస్తున్నాం. నిర్వహణ, ఆపరేషన్లు తదితర అంశాలపై మా బృందం స్టాక్ ఎక్స్చేంజీలను సంప్రదించింది. ఈ రంగంలో అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాం’ అని పేటీఎం సంస్థ ట్వీట్‌లో పేర్కొంది. ఈక్విటీ, క్యాష్ సెగ్‌మెంట్, డెరివేటివ్స్, ఈటీఎఫ్‌లలో పేటీఎం మనీ ట్రేడింగ్‌ను ఆఫర్ చేయనుంది. ఇప్పటి వరకైతే తమ ధరల ప్రణాళికను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇది ప్రస్తుతానికి జెరోధా నేతృత్వంలోని డిస్కౌంట్ బ్రోకరేజీ విభాగంలో ఉంటుందని సమాచారం.
ఎన్‌పీఎస్ సేవలు
పేటీఎం మనీ షేర్ ట్రేడింగ్‌తో పాటు జాతీయ పింఛను(ఎన్‌పీఎస్) సేవలను కూడా అందించనుంది. ఇందుకోసం పింఛను నిధుల నియంత్రణ అభివృద్ధి సంస్థ(పీఎఫ్‌ఆర్‌డీ) నుంచి అనుమతి పొందింది. పేటీఎం ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాంలో 3 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది. ఇప్పటికే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్ సర్వీసులను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: 'మరింత దృఢంగా భారత్-అమెరికా స్నేహబంధం'