కాగ్నిజెంట్ బాటలోనే ఇన్ఫోసిస్ కూడా నడుస్తోంది. మధ్య, సీనియర్ స్థాయిలో ఉద్యోగులను ఇళ్లకు పంపుతోంది. ఉద్యోగుల వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు.. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేసుకోవాలన్నది ఈ ఉద్దేశం వెనక నేపథ్యం. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ఉద్యోగ స్థాయి(జేఎల్)-6(సీనియర్ మేనేజర్లు)లో 10% లేదా 2200 మందిని తొలగిస్తోంది.
4వేల నుంచి 10 వేల ఉద్యోగాలకు ముప్పు
జేఎల్6, జేఎల్7, జేఎల్8 స్థాయిల్లో కంపెనీకి 30,092 ఉద్యోగులున్నారు. జేఎల్3 కంటే దిగవన, మధ్య స్థాయి(జేఎల్4, జేఎల్5)ఉద్యోగాల్లో కంపెనీ కనీసం 2-5% మేర కోతలు విధించనుందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. జేఎల్3, జేఎల్5లలో కంపెనీకి వరుసగా 86,558 మంది; 1.1 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఆ లెక్కన దాదాపు 4,000-10,000 మంది సిబ్బందిపై కత్తి వేళాడుతోందన్నమాట. ఇక మొత్తం 971 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల(అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్లు; వైస్‌ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు)లలో 2-5% మందికి సైతం ఇంటికి వెళ్లమని చెప్పవచ్చు. అంటే 50 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ముప్పు పొంచి ఉందన్నమాట.
సాధారణమే
ఈ విషయమై కంపెనీని సంప్రదించగా.. ‘అత్యుత్తమ పనితీరునున్న మా సంస్థలో సాధారణంగా కోతలు ఉంటూనే ఉంటాయి. వాటిని భారీ స్థాయిలో కోతలుగా చూడకూడద’ని తెలిపింది. ఇంకో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని సైతం భారత్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.