2019-20 సంవత్సరంలో భారత నెలవారీ తలసరి ఆదాయం 6.8 శాతం పెరిగి రూ.11,254కు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. 2018-19లో దేశ నెలవారీ తలసరి ఆదాయం రూ.10,534గా ఉంది.
గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ(ఎంఓఎస్పీఐ).. మంగళవారం వార్షిక జాతీయ ఆదాయం, 2019-20 జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, 2019-20లో తలసరి నికర జాతీయ ఆదాయం రూ.1,35,050గా అంచనా వేసింది. 2018-19లో ఉన్న రూ.1,26,406తో(10 శాతం వృద్ధిరేటుతో) పోల్చితే ఇది 6.8 శాతం పెరిగింది.
దేశ శ్రేయస్సుకు సూచిక
తలసరి ఆదాయం అంటే.. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక మనిషికి సగటున లభించే ఆదాయం. దేశంలో అన్ని రకాలుగా వచ్చే ఆదాయాన్ని(స్థూల జాతీయోత్పత్తి) లెక్కించి, దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు. దీనిని దేశంలోని జీవన ప్రమాణాలు అంచనా వేయడానికి వినియోగిస్తారు.
మందగమనం
జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన జాతీయ ఆదాయ ముందస్తు అంచనాల ప్రకారం, ఉత్పాదక, నిర్మాణ రంగాల పనితీరు 2019-20లో దేశ ఆర్థికవృద్ధి 11 ఏళ్ల కనిష్ఠానికి.. అంటే 5 శాతానికి పడిపోయింది.
ఇదీ చూడండి: కాలం ఎందుకు వెనక్కి వెళ్లదంటే...!