ఎవరైనా ఆస్తిని విక్రయించాలన్నా, కొత్త సంస్థను ప్రారంభించాలన్నా ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడే ముందడుగు వేస్తారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించి, స్టాక్‌మార్కెట్లో నమోదుకు ప్రయత్నించే సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. కేంద్రప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్తోంది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక మందగమనం చుట్టిముట్టిన సమయంలో రూ.68,000 కోట్ల రుణఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను విక్రయించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. 2020 మార్చిలోగా సంస్థను ప్రైవేటీకరించకపోతే, మూసివేయక తప్పదని సాక్షాత్తు కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి ప్రకటించారు. పైలెట్లు, సిబ్బందిలో ఆందోళనకు కారకులయ్యారు. ఎయిరిండియా కొనుగోలుకు ముందుకు వచ్చే సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు దాఖలు చేసేందుకు విధివిధానాలను ఆమోదించడమే కాక, వాటిని ఈ నెలలోనే అందజేయాలని హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయించింది. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యాపరంగా వరసగా నాలుగేళ్ల పాటు రెండంకెల వృద్ధి నమోదైనా, ఈ ఏడాది ఆరంభం నుంచి ఆ దూకుడు తగ్గింది. 2019 జనవరి-నవంబరు నెలల్లో ప్రయాణికుల వృద్ధి అంతకుముందు ఏడాది అవే నెలలతో పోలిస్తే నాలుగు శాతం కంటే తక్కువగా ఉంది. దీనికితోడు దేశీయంగా విమానయాన సంస్థల విలీనం విజయవంతమైన సందర్భాలు లేనందువల్లే దిగ్గజ సంస్థలు కూడా ఎయిరిండియా కొనుగోలుకు దూరంగా ఉంటున్నాయి.
కానరాని ఆసక్తి
ఎయిర్ డెక్కన్‌ను కలుపుకొన్న కింగ్‌ఫిషర్, ఎయిర్ సహారాను కొనుగోలు చేసిన జెట్ ఎయిర్‌వేస్ మూతపడటం గమనార్హం. దేశీయ విమానయాన విపణిలో ఎయిరిండియా వాటా 12.8 శాతం. విపణిలో 47 శాతం వాటా గల ఇండిగో కాని, విస్తారా-ఎయిరేషియాల్లో వాటా కలిగిన టాటాలు కాని ఆసక్తి చూపడం లేదు. మరే ఇతర దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థ కూడా ఎయిరిండియాపై ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. ఎయిరిండియా గ్రూప్‌లో ఎయిరిండియా, చౌకధరల సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ప్రాంతీయ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్, విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలందించే ఏఐశాట్స్, ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ భాగంగా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపే విక్రయిస్తారా, విడిగానా అనే విషయమై ఈ నెలలో స్పష్టత వచ్చే వీలుంది. వేలకోట్ల రూపాయల ప్రజాధనంతో తీర్చిదిద్ది, విలువైన ఆస్తులు సమకూర్చిన ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)లు ఏటా భారీగా నష్టపోతున్నాయి. అందుకు కారణాలను అన్వేషించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవడం మానేసి, వాటిని ప్రైవేటుపరం చేసి చేతులు దులుపుకోవడంపైనే ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత విమానయాన రంగమంటేనే గుర్తుకు వచ్చే ఎయిరిండియాదీ ఇప్పుడు అదే స్థితి. 2018-19లో రూ. 8,556 కోట్ల నష్టం జతచేరాక, ఎయిరిండియా రుణభారం రూ.80,000 కోట్లు దాటిందని చెబుతున్నారు. ఎయిరిండియా రుణంలో వర్కింగ్ క్యాపిటల్ కింద పోగుపడిన రూ.29,500 కోట్ల మొత్తాన్ని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్‌కు కేటాయించారు. ఈ సంస్థ ప్రభుత్వం హామీ ఉన్న బాండ్లను ప్రజలకు విక్రయించడం ద్వారా నిధులు సమీకరించి, ఎయిరిండియా రుణాలు తీరుస్తుంది. ఇలా ఇప్పటివరకు రూ.22,000 కోట్ల వరకు సమీకరించింది కూడా. అంటే రూ.30,000 కోట్ల ప్రజాధనంతో రుణాలు తీర్చి మరీ విక్రయించాలనుకుంటోంది. రుణభారంలో మరో రూ.30,000 కోట్ల భారాన్ని కొనుగోలుదారు వహించాల్సి వస్తుంది. మొత్తంమీద గత దశాబ్దకాలంలో ఎయిరిండియా కార్యకలాపాలు కొనసాగేందుకు ప్రభుత్వం రూ.56,000 కోట్లు వెచ్చించిందనే అంచనాలున్నాయి.
చుట్టుముట్టిన నష్టాలు
ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రయాణికుల సంఖ్య అతితక్కువగా ఉన్న కాలంలో, దశాబ్దాల తరబడి ఎయిరిండియా సేవలు అందించడం వల్ల సంస్థను నిర్వహణ నష్టాలు చుట్టుముట్టాయి. పాలకులు, సంస్థ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఎయిరిండియా రుణాలు అంతకంతకూ పెరిగిపోయాయి. రద్దీమార్గాల్లో, విమానాలకు కీలకమైన సమయాలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడంవల్లా ఎయిరిండియాకు ఆదాయం తగ్గింది. ఆదాయం ఉన్న మార్గాల్లోనే ప్రైవేటు సంస్థలు సర్వీసులు నిర్వహిస్తుంటే, సామాజిక బాధ్యతగా, గిరాకీ తక్కువ ఉన్న మార్గాల్లోనూ ఎయిరిండియా విమానాలు నడుస్తున్నాయి. ఇక ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల వంటి అత్యవసర సమయాల్లో ఎయిరిండియా విమానాలే ప్రయాణికులను ఆదుకుంటున్నాయన్నది కాదనలేని వాస్తవం. అధికారంలో ఉన్నవారికి తోడు, వివిధ ప్రభుత్వరంగ సంస్థలు తమ సిబ్బంది కోసం టికెట్లను ఎయిరిండియా వద్ద రుణంపై కొనుగోలు చేసేవి. ఆయా కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి ఎయిరిండియాకు వసూలు కావాల్సిన మొత్తమే రూ.268 కోట్లకు చేరడంతో, అప్పుపై టికెట్లు ఇవ్వబోమని సంస్థ తాజాగా తేల్చిచెప్పింది. ఇకపై ప్రభుత్వ విభాగాలూ తమ అధికారుల కోసం సాధారణ ప్రయాణికుల మాదిరి డబ్బు చెల్లించే టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. 100 శాతం వాటా విక్రయించకముందే సంస్థలో ఈ మార్పు వచ్చింది. విదేశాల్లో అయితే సామర్థ్యం గల కొనుగోలుదారులు ఉంటారనే భావనతో వారిని ఆకర్షించేందుకు సింగపూర్, లండన్‌లలో ప్రదర్శనలు కూడా నిర్వహించింది. కొనుగోలుకు గట్టిగా ఆసక్తి చూపే సంస్థ ఏదీ ముందుకు రాలేదు.
మెజారిటీ వాటా ఎవరి చేతిలో..
దేశీయ విమానయాన సంస్థల్లో మెజారిటీ వాటా దేశీయుల చేతుల్లోనే ఉండాలని, విదేశీ విమానయాన సంస్థలు మైనారిటీ వాటాకే పరిమితం కావాలని నిబంధన ఉంది. అంటే విదేశీ విమానయాన సంస్థలు 49 శాతం వాటాను మాత్రమే కొనుగోలు చేయగలవు. ఇతర రంగాల్లోని సంస్థలు 49 శాతం కన్నా అధిక వాటా కొనుగోలు చేయొచ్చు కానీ, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ నిబంధన మార్చాలని పారిశ్రామిక ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) పౌర విమానయాన శాఖకు ప్రతిపాదించింది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌లలో సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్)కు ఆకర్షణీయ పథకాన్ని ప్రకటించి, ఈ నెలాఖరు నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎయిరిండియాలో మాత్రం సిబ్బందికి ఇంకా పాత బకాయిలు కూడా తీర్చనేలేదు. పైగా ప్రైవేటీకరణ కాకపోతే, మూసివేస్తామనే బెదిరింపు ధోరణిలో పాలకుల నుంచి హెచ్చరికలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించలేమని పైలెట్లు తెగేసి చెబుతున్నారు. తమకు బకాయిలు చెల్లించాలని, ఆరు నెలల నోటీసు ఇవ్వకుండానే సంస్థ నుంచి తప్పుకొనేందుకు అనుమతించాలని ఎయిరిండియా పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఆస్తుల బలిమి
భారత్ నుంచి విదేశాలకు రాకపోకలు అధికమవుతున్నందువల్ల, మహారాజా చిహ్నం(మస్కట్)తో ప్రయాణికులను ఆకర్షించే ఎయిరిండియాకు విదేశీ మార్గాలు, వివిధ దేశాల ప్రధాన విమానాశ్రయాల్లో ఉన్న స్లాట్స్‌కు సంబంధించి ఉన్న అనుమతులపై అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ఆసక్తి ఉంది. లండన్ హీత్రో విమానాశ్రయంలో ఎయిరిండియా స్లాట్స్‌నూ భారీమొత్తానికి విక్రయించే వీలుంది. 2016లో హీత్రో స్లాట్ కోసం ఒమన్ ఎయిర్ 7.60 కోట్ల డాలర్లు (ప్రస్తుత విలువ ప్రకారం రూ.530 కోట్లకు పైగా) చెల్లించిందంటే, ఎయిరిండియా స్లాట్స్ ఎంత విలువైనవో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే తక్కువ ఛార్జీలు ఉన్న నేపథ్యంలో, దేశీయ విమానయాన రంగంపై అవి ఆసక్తి చూపలేదు. కింగ్‌ఫిషర్, జెట్ ఎయిర్‌వేస్ వంటి దిగ్గజ విమానయాన సంస్థలు రుణభారం నుంచి బయటపడేందుకు వాటాదారు కోసం అన్వేషించినా, ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. వాటితో పోలిస్తే, ఎయిరిండియా విషయంలో ఆకర్షణీయ అంశం- సంస్థకు ఆస్తులు ఉండటం. సంస్థకు దేశవ్యాప్తంగా పెద్దయెత్తున భూములున్నాయి. వీటితోపాటు భవనాలు, ఇతర ఆస్తుల వివరాలను క్రోడీకరిస్తున్నారు. కొన్ని ఆస్తులను ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి లీజుపై ఎయిరిండియా తీసుకుంది. హాంకాంగ్, లండన్, నైరోబీ, మారిషస్, జపాన్‌లలోనూ ఆస్తులున్నాయి. ఎయిరిండియాకు ఉన్న 172 విమానాల్లో 87 పూర్తిగా సంస్థ కొనుగోలు చేసినవి. వీటిలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సహా వైడ్‌బాడీ విమానాలే 26 ఉన్నాయి. వీటికి అధిక విలువ లభిస్తుందనే చెప్పాలి. అమెరికా, ఆస్ట్రేలియాకు సుదీర్ఘంగా ప్రయాణించే విమానాలు దేశీయంగా కలిగిన సంస్థ ఎయిరిండియా మాత్రమే. సాధారణంగా కొత్త విమానాలను వాణిజ్యపరంగా 30 ఏళ్ల పాటు వినియోగిస్తుంటారు. మరో పదేళ్లు వాటికి విహరించే సామర్థ్యం ఉన్నా, వేరే అవసరాలకు వాడుతుంటారు.
ఉద్యోగ భద్రత
ఎయిరిండియా విక్రయానంతరం సంస్థలోని 12 వేలమంది శాశ్వత సిబ్బందికి ఉద్యోగ భద్రత ఎలా కల్పిస్తారనే విషయమై యాజమాన్యం- కార్మిక సంఘాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. సర్వీసు షరతుల్లో గణనీయ మార్పులు రావడం తథ్యం. ఎంతమందిని కొనసాగిస్తారనే భయాందోళనలూ సిబ్బందిలో ఉన్నాయి. ప్రస్తుతం జీవితకాలం పాటు కుటుంబ సభ్యులందరికీ వైద్య సదుపాయం, ఎయిరిండియా విమానాల్లో ఉచిత ప్రయాణం, ప్రావిడెంట్ ఫండ్, సెలవుల నగదీకరణ, గ్రాట్యుటీ వంటి అంశాలూ మారిపోతాయి. మరో 8,000 మంది నిర్దేశిత గడువుతో ఒప్పంద పద్ధతిపై ఉన్నారు. వీరు ఇబ్బంది పడకుండా అవరోధాలు సృష్టించకుండా ప్రభుత్వమే జాగ్రత్తలు వహించాలి. విమానయాన రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపితే, విదేశీ దిగ్గజ సంస్థలు కచ్చితంగా ముందుకు రావచ్చు. ప్రధానంగా విమాన ఇంధనంపై సగటున 35 శాతం పన్ను, నిర్వహణ-మరమ్మతు వ్యయాలకు 18 శాతం వస్తుసేవల పన్ను వంటివి- విదేశాలతో పోలిస్తే దేశీయ విమానయానాన్ని భారంగా మారుస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే, దేశీయ విమానయాన రంగం ప్రగతి బాట పట్టడం ఖాయం!
- కాకుమాను అమర్ కుమార్ (రచయిత)
ఇదీ చూడండి: సుస్థిర లక్ష్యాలకు దూరంగా భారత్!