ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇళ్ల ధరల పెరుగుదలపై ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. గతేడాది జులై-సెప్టెంబర్ల మధ్య భాగ్యనగరంలో ఇళ్ల ధరలు సుమారు 9 శాతం పెరిగాయని సర్వే లెక్కగట్టింది.
ఏకైక భారత నగరం
నివాస స్థిరాస్తి ధరల పెరుగుదలపరంగా చూస్తే.. టాప్ 20లో చోటుదక్కించుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. దీని తరువాత 3.2 శాతం గృహ ధరల పెరుగుదలతో దిల్లీ 73వ స్థానంలో ఉండగా, 2 శాతం పెరుగుదలతో బెంగళూరు 94వ స్థానంలో, 1.1 శాతం గృహ ధరల పెరుగుదలతో అహ్మదాబాద్ 108వ స్థానంలో ఉన్నాయి.
2 శాతం గృహ ధర క్షీణతతో కోల్‌కతా 130వ స్థానంలో, 3 శాతం ధర క్షీణతతో 135, 136 స్థానాల్లో వరుసగా ముంబయి, చెన్నై నిలిచాయి.
కారణమిదే..
గత నాలుగేళ్లలో.. భారత్‌లోని మొదటి ఎనిమిది నగరాల్లో నివాసాల ధరల పెరుగుదల రిటైల్ ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉంది. 2016 నుంచి ఈ అంతరం క్రమంగా పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అయితే హైదరాబాద్ ఒక్కటి మాత్రమే రిటైల్ ద్రవ్యోల్బణ స్థాయి కంటే అధికంగా ఇళ్ల ధరల పెరుగుతున్న నగరంగా ఉందని స్పష్టం చేసింది.
హైదరాబద్‌లో ఇప్పటికే నిర్మాణమై సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని, బేరమాడడానికి అవకాశం ఉండడమూ దీనికి దోహదం చేస్తోందని నైట్ ఫ్రాంక్ తెలిపింది.
బుడాపెస్ట్- నెం.1
హంగేరీలోని బుడాపెస్ట్ నగరం అత్యధిక వార్షిక వృద్ధిరేటు 24 శాతంతో... 'గ్లోబర్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ క్యూ-3, 2019'లో ముందుంది. చైనాలోని జియాన్, వుహాన్ వరుసగా 15.9 శాతం, 14.9 శాతంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
నైట్ ఫ్రాంక్ చేసిన సర్వేలో 150 నగరాల్లో 78 శాతానికి పైగా.. 12 నెలల కాలంలో (ఇళ్ల ధరలు) ఫ్లాట్‌గా లేదా పెరుగుతున్న ధరలను నమోదుచేశాయి. మొత్తంగా చూసుకుంటే ఈ 150 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 3.2 శాతానికి పెరిగాయి. 2015 రెండో త్రైమాసికం తరువాత ఇదే అత్యంత బలహీనమైన వార్షిక రేటు.
ఇదీ చూడండి: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు- నేటి లెక్కలివే...