భారతదేశ ఆర్థిక సంక్లిష్టతలను అర్థం చేసుకోకుండా హడావుడిగా జీఎస్టీ చట్టాన్ని రూపొందించిన విధానకర్తలు ఎన్నో కఠిన వాస్తవాలను అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఆదరాబాదరాగా జీఎస్టీని అమలు చేయడం మొదటి తప్పు. ఈ విధానంవల్ల పన్ను ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయని అంచనా వేసుకోవడం రెండో తప్పు. జీఎస్టీ వసూళ్లు 14 శాతం పెరిగి, చట్టం వచ్చిన కొద్ది నెలల్లోనే మొత్తం వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను మించిపోతాయని అనుకున్నారు. భారత జీడీపీ వృద్ధిరేటు ఎనిమిది శాతాన్ని మించుతుందనుకుంటే అది ఆరు శాతంలోపే తచ్చాడుతోంది. పాత తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొత్త తప్పులు చేస్తున్నారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువులను పేదలు వినియోగించరు కాబట్టి, పన్ను పెంచినా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం ఉండదని తలపోశారు. కానీ, భారతదేశంలో ఆర్థికంగా పైఅంచెలో ఉన్న 35 శాతం వల్లనే అత్యధిక వస్తుసేవల వినియోగం జరుగుతోందని వారు గుర్తించలేదు. వారిలో అయిదు శాతం ధనికులైతే మిగిలినవారు ఎగువ మధ్యతరగతి కిందకు వస్తారు. పన్నులు పెంచితే ఈ వర్గం వినియోగం దెబ్బతిని యావత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోతుంది. కాబట్టి, జీఎస్టీ పెంచడమంటే బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకోవడమే!
జీఎస్టీ వసూళ్లు బాగా తగ్గిపోయాయి. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తాలను కేంద్రం మొన్ననే విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.35,298 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు రూ.1,036 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.925 కోట్లు దక్కాయి. 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార మొత్తాల చెల్లింపులో ఆలస్యం, తరుగుదల గురించి నేటి జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇటీవల కేంద్రం కార్పొరేట్ పన్నులను తగ్గించడంవల్ల తమకు కలిగిన ఆదాయ నష్టాన్ని భర్తీచేయాలని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. 2022 సంవత్సరం వరకు రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాన్ని కేంద్రం భర్తీచేయాలని జీఎస్టీ చట్టం నిర్దేశిస్తోంది. కానీ, ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నష్టాన్ని భర్తీచేయడం లేదని ఆరోపణలు హోరెత్తుతున్నాయి.
జటిలమైన వ్యవస్థ
పరోక్ష పన్నుల వ్యవస్థను, విధానాలను సరళీకరించడానికి, పన్నులు సక్రమంగా కట్టడాన్ని ప్రోత్సహించడానికి జీఎస్టీ తోడ్పడుతుందని మొదట్లో ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనివల్ల పన్నులు తగ్గుతాయని ఊదరగొట్టారు. జీఎస్టీ అమలులోకి వచ్చి ఇప్పటికి రెండేళ్లయినా ఆ ఆశలేమీ నెరవేరకపోగా, పన్నుల వ్యవస్థ జటిలంగా మారింది. జీఎస్టీ వల్ల- మధ్యతరగతి వర్గం వస్తుసేవలకు ఇదివరకటికన్నా ఎక్కువ ధరలు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక భారం పెరిగింది. వారు వినియోగం తగ్గిస్తున్నందువల్ల ఆర్థిక మందగమనం చోటుచేసుకుని కేంద్రం, రాష్ట్రాల ఆదాయం దెబ్బతింది. అయినా జీఎస్టీ మండలి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, పరిహార సెస్సుల కింద 2017-18లో రూ.7,40,650 కోట్లు, 2018-19లో రూ.11,77,370 కోట్లు చొప్పున వసూలయ్యాయి. ఇందులో రాష్ట్రాల జీఎస్టీ వాటాయే అధికం. కేంద్ర జీఎస్టీకన్నా రాష్ట్రాల జీఎస్టీ 20 శాతం నుంచి 30 శాతం వరకు హెచ్చు. అన్నింటికన్నా ఐజీఎస్టీ వాటా ఎక్కువ.
రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తువులపై సమీకృత జీఎస్టీ విధిస్తారు. రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడం కోసం మొదటి అయిదేళ్లపాటు (2020 వరకు) చెల్లించే పరిహార సెస్సు కేంద్ర జీఎస్టీ వసూళ్లలో సగం ఉంటుంది. వాస్తవానికి జీఎస్టీ ప్రవేశపెట్టిన తరవాత ఈ వసూళ్లన్నీ తగ్గిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు, ఐజీఎస్టీ, సెస్సు కింద రూ.6,63,343 కోట్లు వసూలు అవుతాయనుకుంటే- రూ.3,98,333 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది 40 శాతం తగ్గుదల. నిరుడు ఇంకా తక్కువ వసూళ్లు జరిగాయి. 2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం నష్టపరిహార సెస్సు రూపంలో నెలకు సగటున రూ.9,111 కోట్లు వసూలు కావలసి ఉంది. కానీ, 2019 అక్టోబరులో వసూలైంది రూ.7,607 కోట్లు మాత్రమే. జీఎస్టీ వసూళ్లు, రాష్ట్రాలకు దక్కాల్సిన పరిహార సెస్సు తగ్గిపోవడం- కేంద్రం, రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలకు దారితీసి రాజకీయ రంగు పులుముకొంటోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్ను విధానాలు, ప్రధాన ఆర్థిక విధానాల పట్ల విభేదాలు ఏర్పడటం మంచి సంకేతం కాదు. ఉభయుల మధ్య స్థూలంగా ఏకాభిప్రాయం ఉంటేనే ఆర్థిక రథం జోరందుకుంటుంది. అసలే ఆర్థిక మందగతి నెలకొన్న ఈ రోజుల్లో కేంద్రంతో ఘర్షణ వల్ల రాష్ట్రాలే ఎక్కువగా నష్టపోతాయి.
ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే ఆర్థిక స్తోమత హరించుకుపోతుంది. కాబట్టి రాష్ట్రాలు ఘర్షణాత్మక ధోరణి విడనాడాలి. రాష్ట్రాల ఆదాయం తగ్గడానికి- పన్ను వసూళ్లు కోసుకుపోవడంతో పాటు ఇతర కారణాలూ ఉన్నాయని జీఎస్టీ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి 2019 సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో మినహా ఇతర నెలల్లో జీఎస్టీ వసూళ్లు అంతకుముందు సంవత్సరంకన్నా పెరిగాయి. వాస్తవం ఇలా ఉంటే జీఎస్టీని పెంచి తమ ఆదాయ లోటును భర్తీ చేయాలని రాష్ట్రాలు పట్టుపట్టడం విడ్డూరం. ఈ డిమాండును జీఎస్టీ మండలి ఆమోదిస్తే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పుడు పన్నులు పెంచేస్తే సరిపోతుందనుకోవడం తెలివితేటలు ఉన్నవాళ్లు చేసే ఆలోచన కాదు. అలా చేయడం మొదటికే మోసం తెస్తుంది. ఆర్థికంగా గడ్డు స్థితి ఎదురైనప్పుడు కేంద్రమైనా, రాష్ట్రాలైనా వ్యవస్థాపరమైన సంస్కరణలు చేపట్టాలి. ఆ కీలక బాధ్యత నుంచి తప్పించుకోవడానికి పన్నులు పెంచడం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. జీఎస్టీ మండలి తాత్కాలిక ప్రయోజనాల జోలికి పోకూడదు. మార్చి 2020 వరకు నెలనెలా రూ.9,111 కోట్ల పరిహార సెస్సు వసూలు కావలసి ఉంటే, ఏప్రిల్ నుంచి నెలకు రూ.20,000 కోట్ల చొప్పున వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందుకోసం సెస్సును మరింత పెంచాలనుకోవడం ఎంతవరకు భావ్యం?
అప్పులతో దివాళా బాట!
ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలిసీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు రకరకాల వరాలు ప్రకటిస్తాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ తన హామీని నిలబెట్టుకోవడానికి ఎడాపెడా అప్పులు చేసేస్తుంది. అందుకే రాష్ట్రాల రుణభారం ఏటా పెరిగిపోతోంది. 2016-17లో రూ.38.09 లక్షల కోట్లుగా ఉన్న ఈ రుణభారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రూ.52.43 లక్షల కోట్లకు పెరిగింది. నేడు భారతదేశంలో అత్యధిక రుణగ్రస్త రాష్ట్రాలు- ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ్ బంగ, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లే. అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి రాష్ట్రాలు జీఎస్టీని పెంచాలని కోరుతున్నాయే తప్ప, పెట్టుబడులను ఆహ్వానించి పరిశ్రమలు, వ్యాపారాలను తద్వారా పన్ను వసూళ్లను పెంచుకోవాలనే ధ్యాస లేకుండా పోయింది. జీఎస్టీ చెల్లింపునకు సంబంధించిన విధివిధానాలను క్రమబద్ధం చేయాలి. అందరూ తప్పక జీఎస్టీని చెల్లించేట్లు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం వస్తూత్పత్తి సాధనాలపై చెల్లించిన జీఎస్టీని మాత్రమే వాపసు ఇస్తున్నారు. ఇక నుంచి సేవలకూ ఈ విధానాన్ని వర్తింపజేయాలి. వివిధ వస్తువులపై పన్నులను క్రమబద్ధీకరించాలి. ఒకవైపు వ్యవసాయానికి ఊతమివ్వాలంటూనే, ట్రాక్టర్ల విడిభాగాలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయడం సరికాదు. విలాసవంతమైన కార్లపైనా ఇంతే జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుత మందగతి నుంచి బయటపడాలంటే వ్యవసాయానికి ఊతమివ్వాలి. గ్రామాల్లో పడిపోయిన వస్తు సేవల వినియోగాన్ని మళ్ళీ పెంచాలంటే వ్యవసాయ రంగం అధిక వృద్ధిరేట్లను నమోదు చేయాలి. వినియోగం పెరిగినప్పుడు పెట్టుబడులు, వ్యాపారాలు వర్ధిల్లి, పన్ను వసూళ్లు ఇనుమడించి- కేంద్రం, రాష్ట్రాలు ఆర్థికంగా తేరుకుంటాయి.
నియమాలకు విరుద్ధం...
కొన్ని రాష్ట్రాలు వివిధ సంక్షేమ పథకాల పేరిట అలవికాని భారాన్ని తలకెత్తుకోవడం వల్ల నేడు దివాలా అంచుకు చేరాయి. నిజానికి 2018 జనవరిలో 12.6 శాతంగా ఉన్న జీఎస్టీ వాస్తవ సగటు జులైకల్లా 11.8 శాతానికి తగ్గి, 2018 డిసెంబరు-2019 సెప్టెంబరు మధ్యకాలంలో 11.6 శాతం దగ్గర నిలకడగా ఉంది. కాబట్టి, జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయిందనడం సరికాదు. 2019 అక్టోబరు-నవంబరులో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలకు పెరగడం గమనించాలి. సమస్యకు మూలం ఆర్థిక మందగమనంలోనే ఉంది తప్ప, పన్ను వసూళ్లు తగ్గడంలో కాదని తేలిపోతోంది. ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకురాగల సంస్కరణలను రాష్ట్రాలు చేపట్టకపోవడం ఆర్థిక మందగమనానికి దారితీసింది. కొన్ని రాష్ట్రాలైతే వ్యాపారాల పట్ల ప్రతికూల వైఖరి అవలంబిస్తున్నాయి. వ్యాపార వృద్ధితోనే ఎక్కువ పన్నులు వసూలై ప్రభుత్వానికి కావలసిన నిధులు సమకూరతాయని మరిచిపోకూడదు. సబ్సిడీలు, సంక్షేమ పథకాల కోసం భారీగా అప్పులు చేయడం రాష్ట్రాలను దివాలా అంచుకు నెడుతోంది. మరోవిధంగా చెప్పాలంటే ఆదాయాన్ని మించిన ఖర్చులతో రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధికి కారణమయ్యే పారిశ్రామిక, వ్యాపార పెట్టుబడులు ఇనుమడించడం లేదు కానీ, వినియోగంపై వ్యయం మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. సంక్షేమ పథకాలపై రాష్ట్రాలు అపరిమితంగా ఖర్చు చేస్తున్నది ఓట్ల కోసమే. అది ఆర్థిక శాస్త్ర నియమాలకు పూర్తి విరుద్ధం.
- డా. ఎస్.అనంత్, ఆర్థికరంగ విశ్లేషకులు (రచయిత)
ఇదీ చూడండి: ఫిబ్రవరిలో భాజపా నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక..!