రూ.60,000 కోట్లతో చేపట్టిన బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ల పునరుద్ధరణ ప్రణాళికను వేగవంతం చేసేందుకు, పర్యవేక్షించేందుకు ఏడుగురు సభ్యుల మంత్రుల బృందం ఏర్పాటైంది.
"ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థల పునరుద్ధరణ ప్యాకేజీలో... 4 జీ స్పెక్ట్రం కేటాయింపు, అస్సెట్ మోనిటైజేషన్, వ్యాపార సాధ్యత, శ్రామిక శక్తి, బాండ్ల జారీ లాంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ ప్రణాళిక అమలును మంత్రి బృందం వేగవంతం చేస్తుంది. అలాగే పర్యవేక్షణా చేస్తుంది."- అధికారిక వర్గాలు
జీఓఎమ్
ఉన్నత స్థాయి బృందంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్, హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యమంత్రి పీయూష్ గోయెల్, చమురుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభ్యులుగా ఉన్నారు.
పునరుద్ధరణ ప్యాకేజీ
ఈ ఏడాది అక్టోబర్‌లో బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ల కోసం రూ.60,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం నష్టాల్లో మునిగిపోయిన ఈ రెండు సంస్థల విలీనం, ఆస్తులను మొనిటైజింగ్, ఉద్యోగులకు 'స్వచ్ఛంద పదవీ విరమణ' (వీఆర్ఎస్) సౌకర్యం కలిగించడం ద్వారా రెండేళ్లలో ఈ సంయుక్త సంస్థను లాభదాయకం మార్చాలని నిర్ణయించింది.
విలీనం అనివార్యం
ముంబయి, దిల్లీలకు 'మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్' టెలికాం సేవలందిస్తుంది. మిగతా దేశమంతటికీ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' సేవలందిస్తుంది. ఎమ్టీఎన్ఎల్ గత పదేళ్లుగా, బీఎస్ఎన్ఎల్ 2010 నుంచి నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని.. కలిపే ప్రణాళికకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రివర్గం ఆమోదించింది.
వీఆర్ఎస్ ప్రణాళిక అమలువల్ల ప్రస్తుతం 92,700 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా ఈ టెలికాం కంపెనీలకు జీతం బిల్లుల్లో ఏటా రూ.8,800 కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ రెండు సంస్థలు వచ్చే మూడేళ్లలో రూ.37,500 కోట్ల విలువైన ఆస్తులు మోనటైజ్ చేయనున్నాయి.
ఇదీ చూడండి: ఇకపై వాట్సాప్ సందేశాలు మాయం చేయొచ్చు!