దేశీయ దిగ్గజ సంస్థలు టాటా, ఆదానీ, మహీంద్రా, భారత్ ఫోర్జ్ ... భారత నావికాదళానికి 111 స్వదేశీ తయారీ హెలికాప్టర్లను అందించే రూ.25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి.
దేశీయ పరిశ్రమల రక్షణ ఉత్పాదక సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి... నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్య విధానాన్ని అనుసరిస్తూ చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇది. ఇందులో భాగంగా 111 హెలికాప్టర్లను భారతీయ, విదేశీ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో దేశీయంగా తయారు చేయాల్సి ఉంటుంది.
ప్రణాళిక ప్రకారం... మొదటి 16 హెలికాప్టర్లను ఓఈఎమ్ ద్వారా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సమకూర్చుకోవాలి. మిగిలిన 95 హెలికాప్టర్లను భారత్లో ఎంచుకున్న వ్యూహాత్మక భాగస్వామితో కలిసి రూపొందించాల్సి ఉంటుంది.
8 కంపెనీలు పోటీ
మొత్తంగా 8 భారతీయ కంపెనీలు ఈ ప్రాజెక్టు కోసం పోటీపడ్డాయి. అయితే నాలుగింటిని మాత్రమే నావికాదళం ఎంపిక చేసింది. ఇవి తయారుచేసే నూతన హెలికాప్టర్లు... చిరుత/ చేతక్ హెలికాప్టర్ల స్థానాన్ని భర్తీ చేస్తాయి.
మనోహర్ పారికర్ నేతృత్వంలో...
వ్యూహాత్మక భాగస్వామ్య నమూనాను మాజీ రక్షణమంత్రి దివంగత మనోహర్ పారికర్ నేతృత్వంలో రూపొందించారు. తరువాత నిర్మలా సీతారామన్ హయాంలో తుదిమెరుగులు దిద్దారు. ఈ విధానం వల్ల భారత్కు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం చేకూరుతుంది. దేశంలో ఆధునిక రక్షణ ఉత్పత్తుల తయారీకి అవకాశం లభిస్తుంది.
ఇదీ చూడండి: 'సమాజంపై పగ' పేరుతో పిల్లలపై రసాయన దాడి