ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ తర్వాత చాలా మంది తాము తీసుకునే ఆహారంలో సుగంధ ద్రవ్యాలను వినియోగించడం భారీగా పెరిగింది. కొవిడ్ నుంచి రక్షించుకునేందుకు, రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు వీటిని చాలా దేశాల్లో ప్రజలు ఆహారంలో ఉపయోగిస్తున్నారు.
మారిన ఈ పరిణామాలు.. సుగంధ ద్రవ్యాలు విరివిగా లభించే మన దేశానికి భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌తో.. భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతులు భారీగా పెరిగినట్లు పరిశ్రమల విభాగం 'అసోచామ్' వెల్లడించింది. రూపాయి పరంగా చూస్తే వృద్ధి రేటు 34 శాతం పెరిగినట్లు వివరించింది.
అధికంగా ఎగుమతైన సుగంధ ద్రవ్యాలు..
మిరియాలు, యాలకులు, అల్లం, పసుపు, ధనియాలు, జీలకర్ర, సోంఫు, మెంతులు, జాజికాయ, గుగ్గిలం, స్పైస్ ఆయిల్స్, పుదీనా ఉత్పత్తుల వంటివి అధిగంగా ఎగుమతైన సుగంధ ద్రవ్యాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ప్రధాన దిగుమతిదారులు..
భారతీయ సుగంధ ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనాడా, ఆస్ట్రేలియా, యూఏఈ, ఇరాన్, సింగపూర్, చైనా, బంగ్లాదేశ్ ప్రధాన దిగుమతిదారులుగా ఉన్నాయి.
భారత సుగంధ ద్రవ్యాల్లో ప్రధానంగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పసుపు, మిరియాలు, అల్లం వంటి వాటి ఎగుమతులు పాశ్చాత్య దేశాలైన అమెరికా, రష్యా, జర్మనీకి ఇటీవలి కాలంలో 10 రెట్లు పెరిగాయి.
ఎగుమతుల్లో వృద్ధి ఇలా..
ఈ ఏడాది మార్చి-సెప్టెంబర్ గణాంకాల ప్రకారం అల్లం ఎగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయి. మార్చిలో 3.20 కోట్ల డాలర్లుగా ఉన్న అల్లం ఎగుమతుల విలువ ఇప్పుడు 6 కోట్ల డాలర్లు దాటాయి.
పసుపు ఎగుమతుల విలువ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 12 కోట్ల డాలర్లుగా ఉంటే ఇప్పుడు ఏకంగా.. 30 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిరియాల ఎగుమతులు ఒకటిన్నర రెట్లు పెరిగాయి.
సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆహార ధాన్యాల ఎగుమతుల్లో ఈ అసాధారణ పెరుగుదల.. భారతీయుల ఆహార అలవాట్లను అనుసరించడం పాశ్చాత్య దేశాల్లో భారీగా పెరిగిందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తోంది.
ఇదీ చూడండి:రష్యా వ్యాక్సిన్‌కు భారత్‌లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్