ఆర్థిక మందగతిని అధిగమించడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి- వస్తుసేవల వినియోగాన్ని పెంచడం, రెండు- పెట్టుబడులను పెంచడం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె చేసిన పని సరైనదని నేనూ భావిస్తున్నా. మొదటి మార్గంలో వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా జనం చేతికి ఎక్కువ డబ్బు అందిస్తుంది. వారు ఆ డబ్బుతో వస్తువులు, సేవలు కొనుగోలు చేయడం వల్ల గిరాకీ పెరుగుతుంది. దాన్ని తీర్చడానికి ఉత్పత్తి, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగిత పెరిగినప్పుడు వినియోగం-ఉత్పత్తి ఇంకా పెరుగుతాయి. మందగతికి రెండో మందు- పెట్టుబడులు పెంచడం. దీనివల్ల ఉద్యోగాలు, వినియోగం పెరుగుతాయి. గిరాకీ-ఉత్పత్తి-ఉపాధి ఇనుమడిస్తాయి.
భేషైన మార్గమే.. ఐతే!
వినియోగంకన్నా పెట్టుబడులు పెంచడమే భేషైన మార్గం. పెట్టుబడులు పెరిగితే రహదారులు, ఆస్పత్రులు, గృహాలు, తాగు నీటి పైపులైన్లు, రేవుల వంటి మౌలిక వసతులు విరివిగా ఏర్పడతాయి. వాటివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి. ఈ ఏటి బడ్జెట్ మౌలిక వసతుల నిర్మాణానికి రూ.103 లక్షల కోట్ల పెట్టుబడులను వాగ్దానం చేస్తోంది. అసలు నిర్మలా సీతారామన్ మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిందని ముందే ఒప్పుకొని, దాన్ని అధిగమించడానికి నిర్దిష్ట కార్యాచరణను బడ్జెట్‌లో ప్రకటిస్తే ఎంతో బాగుండేది. ఉపాధి కల్పనకు ఆమె కొన్ని పథకాలను ప్రకటించిన మాట నిజమే కానీ, ఆయా పథకాల వల్ల ఎన్నెన్ని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించగలవో అంచనా వేసి ఉంటే సముచితంగా ఉండేది. మందగతిని అధిగమించాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి. వాటిని బడ్జెట్‌లోనే కాకుండా ఇతర సందర్భాల్లోనూ ప్రకటించవచ్చుననే మాట నిజం. కానీ, సంక్షోభ సమయాల్లో సంస్కరణలను స్వీకరించడానికి జనం మానసికంగా సిద్ధమవుతారు. గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే స్వల్పకాలంలో కొంత బాధాకరమైన నిర్ణయాలను భరించక తప్పదని వారు గ్రహిస్తారు.
ఒకటి చేశారు.. మరొకటి వదిలేశారు.
ఉదాహరణకు వ్యవసాయంలో చాలా కీలకమైన సంస్కరణ గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. అదేమంటే- రైతుల నుంచి దీర్ఘకాలిక లీజుపై భూములు తీసుకుని ఒప్పంద వ్యవసాయం చేయడం. దీనివల్ల వ్యావసాయిక ఉత్పాదకత అద్భుతంగా మెరుగుపడుతుంది. ఒప్పంద లేదా కాంట్రాక్టు సేద్యం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి సూచిస్తున్నా, రాష్ట్రాలు వేగంగా స్పందించడం లేదు. ఈ సంస్కరణను చేపట్టే రాష్ట్రాలకు గణనీయ ప్రయోజనాలను అందించి, చేపట్టని రాష్ట్రాలకు చురుకు కలిగించే పనిని ఆర్థిక మంత్రి చేపడతారని ఆశించాను. కానీ, ఆమె ఆ పని చేయకుండా ఓ గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నారు. వ్యవసాయంతోపాటు స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి భూ, కార్మిక సంస్కరణలను బడ్జెట్‌లో చేపట్టి ఉంటే, దేశంలో పారిశ్రామిక వాతావరణానికి గొప్ప ఊపు వచ్చేది.
సుంకాల పెంచడం ఏమిటి తల్లీ!
స్వీయ వాణిజ్య రక్షణ విధానాలతోపాటు, దిగుమతులకు స్వదేశంలోనే ప్రత్యామ్నాయాలను తయారుచేసుకోవాలన్న విఫల విధానాన్నీ విడనాడుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించకపోవడం చాలా నిరుత్సాహం కలిగించింది. ఆర్థిక సర్వేను చూశాక ఈ ఏటి బడ్జెట్ ఎగుమతుల వృద్ధికి అత్యంత ప్రాముఖ్యమివ్వబోతుందని ఆశలు రేకెత్తాయి. చైనాలో సమస్యల కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నాయి. ఇంతకాలం చైనాలో సాగిస్తూ వచ్చిన ఉత్పత్తి ప్రక్రియను పూర్తిగానో, పాక్షికంగానో ఇతర దేశాలకు మళ్లించాలని చూస్తున్నాయి. చైనాలో కార్మిక వ్యయం పెరగడం కూడా దీనికి ఒక కారణం. దీన్ని భారతదేశం ఒక మహదావకాశంగా తీసుకుంటుందని ఆశించాం. తాజా బడ్జెట్‌లో సుంకాలను తగ్గించి, దేశాన్ని విదేశీ సంస్థలకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మలుస్తారని అంచనా వేసుకున్నాం. అది జరగకపోగా కొన్ని వస్తువులపై సుంకాలు పెరిగాయి. ఏ దేశమూ కేవలం సొంత మార్కెట్‌పై ఆధారపడి సుసంపన్నం కాలేదని గుర్తుంచుకోవాలి. విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా అమూల్య విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాలి. దాన్ని పెట్టుబడులుగా మార్చి స్వదేశంలో పరిశ్రమలను విస్తరించుకోవాలి. కానీ, ఈ ప్రభుత్వం ఎగుమతి మార్కెట్లను జయించడంలో విఫలమవడంతో అది ఉద్యోగాల కల్పనలో వైఫల్యానికి దారితీసింది. గడచిన ఏడు సంవత్సరాలలో వియత్నాం ఎగుమతులు 300 శాతం పెరగ్గా, భారత ఎగుమతులు ఎదుగూబొదుగూ లేకుండా ‘ఎక్కడ వేసిన గొంగడి...’ చందంగా మిగిలిపోయాయి.
వాస్తవిక బడ్జెట్!
ఈ బడ్జెట్ శీఘ్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేయదు కానీ, మొత్తం మీద ఇది వివేకవంతమైన, వాస్తవికమైన బడ్జెట్ అని చెప్పాలి. భారీ ఉద్దీపనలు ప్రకటించడానికి మనకు ఆర్థిక స్తోమత ఎటూ లేదు. 2008లో ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు భారత్ సాహసిక నిర్ణయాలు తీసుకుంది. వాటివల్ల కొన్ని చేదు ఫలితాలు సిద్ధించడం వేరే సంగతి. ఈసారి ఆర్థిక మంత్రి సాహసాలు చేయడానికి ఇష్టపడలేదు. వ్యయాన్ని అదుపులో పెట్టుకొంటూ జీడీపీని పెంచుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ బడ్జెట్‌లో నాకు వ్యక్తిగతంగా నచ్చిన అంశాలు మూడు ఉన్నాయి. అవి పారిశుధ్య పనులకు మానవులను నియమించకూడదని కట్టుబాటు ప్రదర్శించడం, కంపెనీల చట్టంలో పూర్వం పౌర నేరాలుగా పరిగణించినవాటిని కొత్త బడ్జెట్ నేరాలుగా పరిగణించకపోవడం. పాత పద్ధతి వల్ల వ్యాపార వర్గానికీ ప్రభుత్వానికీ మధ్య పొరపొచ్చాలు ఏర్పడేవి. వాటిని ఇప్పుడు తొలగించడం మంచి పని. ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులను వేధించరాదంటూ చట్టబద్ధమైన నియమావళిని రూపొందించడం మూడో మంచి మార్పు. ఈ మూడు అంశాలను సక్రమంగా అమలుచేస్తే గణనీయ పురోగతి సిద్ధిస్తుంది.
రచయిత
గురుచరణ్‌దాస్ (ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు)
ఇదీ చూడండి: పాన్‌కార్డు లేదా? ఇలా చేస్తే క్షణాల్లోనే 'ఈ-పాన్'