ఆర్థిక సేవలు, కీలక మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలంటూ రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడు నరేంద్ర జాదవ్ ప్రవేశపెట్టిన ప్రైవేటు సభ్యుల బిల్లుకు పార్టీలకు అతీతంగా అందరు సభ్యులు మద్దతు తెలిపారు. ఆయా రంగాల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి సమాచార పరిశీలన జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రంగాల్లోకి వచ్చే ఎఫ్‌డీఐలపై తప్పక సమాచార పరిశీలన చేయాల్సిందే అని పేర్కొన్నారు.
చూస్తూ ఊరుకోవాలా?
జాదవ్ గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా డిసెంబర్ 6న ఈ బిల్లును ప్రవేశపెట్టగా....అప్పుడు తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు. శుక్రవారం ప్రసంగాన్ని పూర్తి చేసిన జాదవ్ ఎఫ్‌డీఐలు అసాధారణ స్థాయిలో 284 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. ఆర్థిక సేవలు వంటి సున్నితమైన రంగాల్లో విదేశీ పెట్టుబడి అనుమతికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారన్న జాదవ్...బ్యాంకింగేతర రంగాలు, చెల్లింపు సంస్థల్లో వంద శాతం ఎఫ్‌డీఐలను చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: ఔషధ పరిశ్రమపై కరోనా పడగ