బస్సులో వెళ్తున్న ఓ యువతికి బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన తమిళనాడు వెల్లూరులో జరిగింది. అంబూరు సమీపంలోని సాండ్రోర్ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్ స్థానికంగా ఉంటున్న ఓ యువతిని కళాశాల రోజుల నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెకు ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు.
ఇటీవలే ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి కుదిరింది. విషయం తెలుసుకున్న జగన్.. యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. ఆమె నిరాకరించడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయాడు. మంగళవారం ఉదయం ఆ యువతి అంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో వెళుతుండడం చూసి తను కూడా వాహనం ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న తాళిని ఆమెకు బలవంతంగా కట్టే ప్రయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడం వల్ల తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. జగన్ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితునిపై కేసు నమోదుచేశారు.
ఇదీ చూడండి: విద్యార్థినులపై వేధింపులు.. చితకబాదిన మహిళా కానిస్టేబుల్