నిర్భయ కేసు దోషులను మరికొద్ది రోజుల్లో ఉరితీయనున్న వేళ మహారాష్ట్ర గోందియా జిల్లా పార్డీ ప్రాంతంలో మరో నిర్భయ తరహా అత్యాచార ఘటన జరిగింది. యోగిలాల్ రహంగ్‌డేల్ (52).. 19 ఏళ్ల యువతిని చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఏం జరిగింది?
పార్డీ ప్రాంతంలో 19 ఏళ్ల యువతి ఓ ప్రవేటు పత్తి మిల్లులో కార్మికురాలుగా పనిచేస్తోంది. ఆ మిల్లులోనే సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు నిందితుడు యోగిలాల్. బాధితురాలు, ఆమె సోదరుడు, మరో యువతి, నిందితుడు పార్డీ ప్రాంతంలో వేర్వేరు ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. బాధితురాలి సోదరుడు, మరో యువతి అనివార్య కారణాల వల్ల జనవరి 21న సొంత ఊరికి వెళ్లారు. యువతి ఒంటరిగా ఉందని గమనించిన యోగిలాల్ ఆ రోజు రాత్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ప్రతిఘటించగా నోట్లో వస్త్రం కుక్కాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఒక ఇనుప రాడ్‌తో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.
ఘటనపై బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పార్డీ ఇన్స్పెక్టర్ సునీల్ చవాన్ తెలిపారు.